Jaggareddy warning: నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మంత్రి కేటీఆర్‌ను కలిస్తే.. తెరాస కండువా కప్పుతారా అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తెరాసలో చేరాలనుకుంటే నేరుగానే వెళ్తానని... తనని ఎవ్వరూ అడ్డుకోలేరని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్‌తో కలిస్తే తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవాళ్లు.. రేవంత్‌రెడ్డిపై ఎందుకు నోరుమెదపరని ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్, రేవంత్‌రెడ్డి సరదాగా ఉన్న ఓ ఫొటోను చూపిస్తూ.. దీనిపై ఎలాంటి వార్తలు రాస్తారన్నారు.
పీసీసీ సమావేశంలోనూ నిలదీస్తా..
తనపై క్రమశిక్షణ కమిటీ చేస్తున్న ఆరోపణలను కూడా తీవ్రస్థాయిలో ఖడించిన జగ్గారెడ్డి.. తాను పార్టీ పరిధిలోనే ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీలో రేవంత్‌రెడ్డి చాలా వరకు లైన్ దాటి వ్యవహిస్తున్నారని.. అవేవీ కమిటీకి కనిపించట్లేదా అని నిలదీశారు. మీడియా ముందు మాట్లాడటం కొంత ఇబ్బందిగా ఉన్నా.. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యతతోనే మాట్లాడాల్సివస్తోందన్నారు. త్వరలో జరగబోయే పీసీసీ సమావేశంలోనూ.. ఈ విషయాలను లేవనెత్తుతానని పేర్కొన్నారు. ఎవరెన్ని ప్రచారాలు చేసినా.. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ఆ కర్మ నాకు పట్టలేదు..
"సంగారెడ్డిలో జరిగిన అధికారిక కార్యక్రమంలో మంత్రి హోదాలో పాల్గొన్న కేటీఆర్‌ను.. ఎమ్మెల్యేగా కలిశాను. అభివృద్ధి కోసం నిధులు అడిగాను. నాయకులు ఎదురెదురుగా కలిసినప్పుడు పలకరించుకోవడం సంప్రదాయం. మంత్రి కేటీఆర్‌ను కలిస్తేనే.. పార్టీ కండువా కప్పుతారా..? మరి అదే కేటీఆర్‌ను రేవంత్‌రెడ్డి కూడా కలిశారు. ఆయన మీద ఎందుకు ఇలాంటి వార్తలు రాయరు. ఒకట్రెండు యూట్యూబ్ ఛానెళ్లు నేను ఏకంగా కేటీఆర్‌కు ఏజెంట్ అని రాశారు. అవే ఛానెళ్లు మాత్రం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎందుకు రాయరు. తెరాసలోకి వెళ్లాలనుకుంటే నాకు అడ్డం ఏముంది. నేరుగానే వెళతా. కోవర్టుగా ఉండాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఏదంటే అది రాస్తా అంటే.. చూస్తూ ఊరుకునేది లేదు. తాట తీస్త"
- జగ్గారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఇదీ చూడండి: