దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తోందని, రైతులను కేసీఆర్, మోదీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ చట్టాలపై గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తే అనుమతి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీకి అడ్డు రాని కరోనా... కాంగ్రెస్ నాయకులు కలిస్తే వస్తుందా అని గవర్నర్ను ప్రశ్నించారు.
కేసీఆర్ అసమర్థత వల్ల రైతులకు పంట బీమా దక్కలేదని, వర్షాలతో నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేదని ఉత్తమ్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు ఇచ్చినట్టు పేర్కొన్న ఆయన... సకాలంలో పాస్ పుస్తకాలు ఇవ్వనందునే రాష్ట్రంలో 10లక్షల మందికి రైతుబంధు అందడం లేదన్నారు. రైతు సమస్యలపై అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు.
పార్లమెంట్‌లో ఏకపక్షంగా మూడు బిల్లులను భాజపా పాస్ చేయించిందని... ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని ఉత్తమ్ ధ్వజమెత్తారు. రైతులకు రక్షణ కల్పించే అంశాలు ఏమీ లేవని, కేవలం కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేట్టు మాత్రమే ఉన్నాయని ధ్వజమెత్తారు. ప్రధానిమంత్రి మోదీ చెప్పినదానికి, చట్టంలో పొందుపర్చిన అంశాలకు పొంతన లేదన్నారు. దేశమంతా ఒక ధర ఉంటే... బిహార్లో మాత్రం 25శాతం తక్కువ ఉండటం వల్ల వారి కోసమే చట్టాలు తెచ్చారని విమర్శించారు.
ఇదీ చూడండి: 'వినతిపత్రం ఇచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదు'