Pawan Kalyan Ukku Deeksha : "ఇది వ్యక్తుల సమస్య కాదు.. పార్టీల సమస్య కాదు.. కుల, వర్గ సమస్య కానే కాదు.. ఇది రాష్ట్ర సమస్య. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. వైకాపా ముందుండి అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలి" అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఇది చేతకాకపోతే.. చట్ట సభల్లో ఉండడం దేనికి? అని వైకాపా శాసనసభ్యులను పవన్ నిలదీశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఆదివారం ఉదయం నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన పవన్.. సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమించారు. అనంతరం ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో అధికార వైకాపా చిత్తశుద్ధిని ప్రశ్నించారు.
పార్టీలన్నీ ఏకం కావాల్సిందే..
విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రయోజనానికి సంబంధించిన విషయమన్న పవన్.. ఈ విషయంలో అన్ని పార్టీలూ ఏకం కావాలని కోరారు. ఈ విషయంలో.. 22 మంది ఎంపీలు ఉన్న వైకాపా ఏం చేస్తోందని పవన్ ప్రశ్నించారు. కేంద్రం ప్రైవేటీకరిస్తుంటే.. రాష్ట్ర సర్కారు కనీసం ప్రశ్నించట్లేదని అన్నారు. ఇది కూడా చేతకాని వ్యక్తులు.. చట్టసభల్లో కూర్చోవడం దేనికని నిలదీశారు. తనకు ప్రజాబలం ఉందన్న పవన్.. చట్టసభల్లో మాత్రం బలహీనుడినని అన్నారు. ఇవన్నీ ఉన్నవారు మాత్రం నోరు మూసుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో.. వైకాపా దౌర్జన్యం, రౌడీయిజం తారస్థాయికి చేరిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో అధికారం ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నారన్న పవన్.. జనసేనకు అధికారం ఇస్తే.. ఏం చేయవచ్చునో చేసి చూపిస్తామని చెప్పారు.
అప్పు ఉందని అమ్మేస్తారా?
అప్పు ఉందని ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తారా? అని పవన్ ప్రశ్నించారు. ఆ లెక్కన ఏపీ ప్రభుత్వానికి కూడా రూ.6 లక్షల కోట్లు అప్పు ఉందన్న జనసేనాని.. అప్పుల పాలయ్యిందని ఏపీని కూడా అమ్ముతారా? అని నిలదీశారు. స్టీల్ అత్యధికంగా వాడే దేశాల్లో భారత్ రెండోస్థానంలో ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ ఉక్కు కోసం 67 ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు పోరాడారన్న పవన్.. ఎంతోమంది ప్రాణత్యాగాలతో విశాఖకు స్టీల్ ప్లాంట్ వచ్చిందన్నారు. అలాంటి ఫ్యాక్టరీని అమ్మేస్తామంటే రాష్ట్ర సర్కారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
ప్రజలే మేల్కోవాలి..
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి ప్రజలు ముందుకు కదలాలని జనసేన అధినేత అన్నారు. దీనికి ముందుగా.. చట్టసభల్లో బలమున్న వైకాపా బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని అన్న పవన్.. అధికార పార్టీకీ అల్టిమేటం ఇవ్వలేను అన్నారు. ప్రజలే ఆ పని చేయాలని కోరారు. ఓట్లు వేయించుకున్న వైకాపాకు స్టీల్ ప్లాంట్ బాధ్యత లేదా అని ప్రశ్నించారు. వైకాపా నేతలను ప్రజలు నిలదీయాలని కోరారు. తాను ప్రజలకోసమే పార్టీ పెట్టానన్న పవన్.. తన ఒక్కడి కోసమైతే.. ఏదో పార్టీలో చేరి కేంద్రమంత్రిని కూడా కాగలనని అన్నారు. ధైర్యంలేని సమాజంలో మార్పు సాధ్యం కాదన్న పవన్.. ప్రజల్లో ధైర్యం వస్తేనే స్టీల్ ప్లాంట్ నిలబడుతుందని అన్నారు.
విపక్ష నేత భార్యనే దూషిస్తే.. వీధిలో మహిళలకు రక్షణ ఉంటుందా?
యూపీ, బిహార్ రాష్ట్రాల్లో శాంతిభద్రతలు అథమంగా ఉంటాయని అంటుంటారని.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటిని మించిపోయిందని పవన్ అన్నారు. ఏకంగా ఎమ్మెల్యేలే రౌడీయిజం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం స్థాయి వ్యక్తిని, ఆయన సతీమణి గురించి దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. విపక్ష నేత భార్యనే అసెంబ్లీలో దూషిస్తే.. వీధిలో మహిళలకు రక్షణ ఏముంటుందని నిలదీశారు పవన్.. చట్టసభల్లో బూతులే శాసనాలు అవుతున్నాయని ఆగ్రహించారు. ఇలాంటి సర్కారును గద్దె దించాలన్న పవన్. 2024లో వచ్చే కొత్త ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలని ప్రజలను కోరారు.
కర్నూలు రాజధాని అంటే నమ్మాలా?
రాష్ట్ర ప్రజలు తమ ఓటు అనే చినుకును వైకాపా పెనంపై వేసి జీవితాలను ఆవిరి చేసుకున్నారని, అదే.. ఓటు అనే చినుకును జనసేన అనే ఆల్చిప్పలో వేయండి. మీ జీవితాలన్నీ మెరుస్తాయని పవన్ అన్నారు. మంచి మనుషులు ఏ పార్టీలో ఉన్నా.. తాను ప్రేరణగా తీసుకుంటానని అన్నారు. దామోదరం సంజీవయ్యపై చాలా అభిమానం ఉందన్నారు. ఆయనకు చిన్న స్మారక భవనం కూడా నిర్మించలేదని, సంజీవయ్య స్మారకానికి తాను రూ.కోటి ఇచ్చానని చెప్పారు. దామోదరం సంజీవయ్యకు చిన్న స్మారకం నిర్మించలేని వీరు.. కర్నూలు రాజధానిగా చేస్తామంటే నమ్మాలా? అని నిలదీశారు.
నా సినిమాలు ఉచితంగా చూపిస్తా..
తన సినిమాలు ఆపేసి, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలని చూశారని పవన్ ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలకు తాను భయపడబోనని తేల్చిచెప్పారు. పంతానికి దిగితే.. ఆంధ్రప్రదేశ్‌లో నా సినిమాలు ఉచితంగా చూపిస్తానని అన్నారు. సినిమా టికెట్లకు పారదర్శకత లేదంటున్నారని, సర్కారు అమ్మే మద్యానికి పారదర్శకత ఉందా? ప్రశ్నించారు. రూ.700లతో మద్యం కొనండి.. రూ.5తో సినిమాకు వెళ్లండి అని చెబుతున్నారని విమర్శించారు.
ఒక్క ప్రాజెక్టు అయినా ప్రారంభించారా?
‘వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంతవరకూ ఒక ప్రాజెక్టు అయినా ప్రారంభించారా? రాష్ట్రానికి 500 మంది సలహాదారులా? కానీ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ ఎలా ఆపాలో చెప్పరా? ఏడుకొండల వాడూ వీరి పాపాలను భరించలేకపోతున్నాడు. భారీ వర్షాలకు కడప దెబ్బతింది. రాయలసీమ దారుణమైపోయింది. ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి నమస్కారం పెట్టి ఒక చిన్న నవ్వు నవ్వితే సరిపోతుందా? గట్టిగా అక్కడ నిలబడక్కర్లేదా?’ అని నిలదీశారు.
మహాపాదయాత్ర ముగింపు సభకు మద్దతివ్వాలి: రైతులు
ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్ అని అమరావతి రాజధాని ప్రాంత మహిళా రైతులు స్పష్టం చేశారు. రాజధాని విషయంలో, విశాఖ ఉక్కు పరిరక్షణ అంశంలో ఆయన మాట మీద నిలబడ్డారని పేర్కొన్నారు. రాజధాని రైతుల పక్షాన ఆకుల జయసత్య, పాతూరి రాధిక, శైలజ, బత్తుల గంగాభవాని తదితరులు వచ్చి పవన్ కల్యాణ్‌ను కలిశారు. ‘పాదయాత్ర చివరి ఘట్టంలో మీరు పాల్గొంటే మాకు వెన్నెముకగా నిలిచినట్టుంటుంది. అమరావతిని సాధించుకునే వరకూ మాకు అండగా నిలవండి. ఈ నెల 17న పాదయాత్ర ముగింపు సభకు మద్దతివ్వండి’ అని కోరారు.
ఇదీ చూడండి: