హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 2750 బస్సులున్నాయి. కార్యాలయ వేళల్లో ఒక్కో బస్సులో 100 మంది ఎక్కితే ఒకేసారి 2.75 లక్షల మంది ప్రయాణించొచ్చు. ఒక్కో బస్సు ఉదయం 4 ట్రిప్పులు, మధ్యాహ్నం 4 ట్రిప్పులు తిరిగినా రోజుకు 22 వేల ట్రిప్పులవుతాయి. ఒక్కో ట్రిప్పులో 100 మంది చొప్పున లెక్కేస్తే రోజుకు 22 లక్షల మంది అవుతారు. కానీ ఆర్టీసీ అధికారులు మాత్రం 29 లక్షల మంది ప్రయాణిస్తున్నారని లెక్కలు చెబుతున్నారు. మరి ఏ లెక్కన చెప్తున్నారో వారికే తెలియాలి. ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకే బస్సులను రోడ్డెక్కిస్తున్నారు. ఒక్క సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచే 10.45 వరకూ బస్సులున్నాయి.
- ఇక ఐటీ సంస్థల్లో ప్రత్యక్షంగా 5 లక్షల మంది, పరోక్షంగా మరో 2 లక్షల మంది పనిచేస్తున్నారు. 60 శాతానికి మించి ప్రజారవాణానే వినియోగించే వీరు ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. మెట్రోలో, ఎంఎంటీఎస్‌లో ప్రయాణించినా.. కార్యాలయానికి చేరువ వరకూ వెళ్లాలంటే బస్సుల్లో ప్రయాణించాల్సిందే. కార్యాలయాలు తిరిగి ప్రారంభమైతే ప్రయాణికులకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు.
వేలాడుతూ రాకపోకలు..
బస్సులో సీట్లు 45 ఉంటే మరో 15-20 మంది నిల్చుని ప్రయాణించవచ్చు. కానీ ప్రస్తుతం బస్సుల్లో 100 మందికిపైగా ప్రయాణిస్తున్నారు. శివార్లకు వెళ్లే కొన్ని బస్సుల్లో విద్యార్థులు వేలాడుతూ వెళ్తున్నారు. హయత్‌నగర్, మేడ్చల్, పటాన్‌చెరు, చేవెళ్ల, ఘట్‌కేసర్ వైపు వెళ్లే బస్సులను చూస్తే విద్యార్థుల అవస్థలు కనిపిస్తాయి. పాస్‌లున్నవారే దాదాపు 6 లక్షల మంది.
ముంబయి జనాభా 2011 లెక్కల ప్రకారం 1.24 కోట్ల మంది ఉన్నారు. 2021 నాటి అంచనాల మేరకు 2.06 కోట్లకు చేరింది. ఆ నగరాన్ని తలచుకోగానే సబర్బన్ రైళ్ల పరుగులే గుర్తుకొస్తాయి. ఉదయం 4 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు లోకల్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో నిత్యం 60 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు 4,680 ఉంటే ప్రయాణించేవారు 4.50 లక్షల మందే.
బెంగళూరులో..
బెంగళూరు జనాభా 2011 లెక్కల ప్రకారం 84 లక్షల మంది ఉంటే 2021 నాటి అంచనాల మేరకు 1.27 కోట్లకు చేరింది. అక్కడి ప్రజారవాణా మెరుగ్గా ఉంటుందని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. మొత్తం 6,529 బస్సులున్నాయి. వీటిలో ప్రయాణించేవారి సంఖ్య 35.8 లక్షల మంది. 2025 నాటికి ఈ బస్సుల సంఖ్యను 12,500 చేయాలని బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ) నిర్ణయించింది. దీనికితోడు బెంగళూరులో సబర్బన్ రైలు సర్వీసులు, మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. నేరుగా విమానాశ్రయానికి సబర్బన్ రైళ్లున్నాయి.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్ జనాభా 2011 లెక్కల ప్రకారం 67.31 లక్షలు. 2021 నాటికి ఈ జనాభా 1.02 కోట్లకు చేరి ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. పదేళ్ల క్రితం 3,750 బస్సులుండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య 2,750కి తగ్గింది. ఇదే సమయంలో జనాభా 33 లక్షలు పెరిగితే అందుకనుగుణంగా బస్సులను పెంచాల్సింది పోయి తగ్గించారు. మెట్రో వచ్చినా వాటి ప్రయాణికులు 4 లక్షలకు మించడం లేదు. నగరంలో కనీసం 7,550 బస్సులుండాలని రవాణా రంగ నిపుణులు సూచించారు. ఎంఎంటీఎస్ రైళ్లు గతంలో 121 సర్వీసులు తిరిగితే 1.80 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు వాటి సర్వీసులూ 50కి పడిపోయాయి. ఆ ప్రయాణికుల సంఖ్య 30 వేల నుంచి 35 వేలని రైల్వే అంచనా వేస్తోంది.
ప్రజారోగ్యంగా ప్రజారవాణాను పరిగణించాలి..
'ప్రజారవాణాను లాభాలతో ముడిపెట్టడం తగదు. ప్రజారోగ్యంగా భావించాలి. ప్రజారవాణా తగ్గిపోతున్న కొద్దీ ప్రైవేటు, వ్యక్తిగత వాహనాలు రోడ్డెక్కి ట్రాఫిక్ జామ్‌లు, వాయు కాలుష్యం పెరిగి, సమయం వృథా అవ్వడమే కాకుండా ఆరోగ్యాలూ దెబ్బతింటాయి. పెట్రో ధరలు పెరగడంతో చిరు ఉద్యోగులు వ్యక్తిగత వాహనాలు తీయడం లేదు. బస్సులు సరిపడా లేక తిప్పలు పడుతున్నారు. మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను అన్నిమార్గాల్లో తిప్పలేని పరిస్థితుల్లో సిటీ బస్సులను పెంచడమే ప్రత్యామ్నాయం.'
- ప్రశాంత్, పట్టణ రవాణా రంగ నిపుణులు
ఇదీచూడండి: cab ride cancellation : డ్రైవర్లకు గిట్టదు..యాప్‌లకు పట్టదు!