ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఏపీలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలు ఉండగా ...126 ఏకగ్రీవమయ్యాయి. 8 స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోగా...పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించిన 11 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 2 వేల 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏపీలో 10,047 ఎంపీటీసీ స్థానాలుండగా... 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 375 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదు.
అభ్యర్థులు మరణించిన 81 చోట్ల ఎన్నికలను వాయిదా వేశారు. మిగిలిన 7,220 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 18,782 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 7,735 పరిషత్ స్థానాలకు ఉదయం 7గంటల నుంచి ...సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే ఎన్నిక ముగియనుంది. 2,46,71,00,2 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి....
ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 27,751 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వీటిలో 6,492 సున్నిత పోలింగ్ స్టేషన్లు కాగా....అతి సున్నితమైనవి 6,314 కేంద్రాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. 247 స్టేషన్లను నక్సల్ ప్రభావిత పోలింగ్ స్టేషన్లుగా గుర్తించామన్న అధికారులు....వీటిల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 43,830 పెద్ద బ్యాలెట్ బాక్సులు, 12,898 మధ్యరకం... 46, 502 చిన్న తరహా బాక్సులను ఎన్నికల్లో వినియోగిస్తున్నట్లు చెప్పారు. 652 మంది రిటర్నింగ్ అధికారులు, 1091 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను ఎన్నికల కోసం నియమించామన్నారు. పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు 6,524 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు ఏపీ ఎస్ఈసీ వెల్లడించింది.
కొవిడ్ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు...
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సిబ్బందికి మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, హ్యాండ్ గ్లోవ్స్ అందించినట్లు వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో భౌతిక దూరాన్ని తప్పని సరిగా పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఎవరైనా కొవిడ్ పాజిటివ్ ఉన్న వారు ఉంటే వారికి పీపీఈ కిట్లు అందించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కొవిడ్ ఉన్న వారు చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.