రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యకలాపాల పనితీరు మెరుగు, పర్యవేక్షణ కోసం పంచాయతీరాజ్ శాఖ రెండు యాప్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పంచాయతీ కార్యదర్శుల కోసం ఒకటి, తనిఖీ అధికారుల కోసం అభివృద్ధి చేసిన యాప్స్‌ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆవిష్కరించారు. రోజువారీ పారిశుద్ధ్య కార్యకలాపాలు, నెలవారీ పల్లెప్రగతి కార్యకలాపాలు, గ్రామసభ నిర్వహణ, ధ్రువపత్రాలు, జనన-మరణ-వివాహ రిజిస్ట్రేషన్లు, ఖర్చులు, ఆదాయం, బిల్లుల చెల్లింపులు తదితరాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.
తనిఖీ అధికారులు ప్రతివారంలో ఒక మారు గ్రామంలో పరిశీలించి వాటిని యాప్‌లో నమోదు చేయాలని మంత్రి తెలిపారు. రోజువారీ, నెలవారీ ప్రాతిపదికన గ్రామ పంచాయతీ ముఖ్యమైన కార్యకలాపాలను సమగ్రంగా రికార్డు చేసేలా అభివృద్ధి చేసినట్టు వివరించారు. గ్రామ కార్యదర్శి మొదలు డీపీఓ, జిల్లా స్థాయి అధికారుల వరకు పని తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నట్టు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో గుర్తించిన సమస్యల సత్వర పరిష్కారం కోసం కృషి చేయనున్నట్టు తెలిపారు. పల్లెల్లో పారిశుద్ధ్యం, పచ్చదనాన్ని పెంపొందించేందుకు నిరంతరం కృషి జరుగుతుందన్న మంత్రి ఎర్రబెల్లి... ప్రతి గ్రామంలోనూ పరిశుభ్రమైన, అరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలనేదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అన్నారు.
ఇదీ చూడండి: దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి.. రేపు మధ్యాహ్నానికి ఫలితం