ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు అరుదైన రికార్డు సృష్టించారు. అత్యంత అరుదైన ప్లాస్టిక్ సర్జరీని దిగ్విజయంగా పూర్తి చేసిన ఘనత సాధించారు. నల్గొండ జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతికి బ్రెస్ట్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. బ్రెస్ట్ హైపోప్లాసియా అనే సమస్యతో బాధపడుతున్న యువతికి.. కుడి వైపున రొమ్ము భాగం సరిగా అభివృద్ధి చెందలేదు. ఫలితంగా యువతికి ఇంప్లాంటేషన్ చేయాల్సి వస్తుందని సదరు వైద్యులు సూచించారు. అయితే ఇందుకు లక్షల్లో ఖర్చు అవుతుందని తెలుసుకుని యువతి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
ఆ సమయంలోనే ఉస్మానియా వైద్యులను సంప్రదించారు. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు శస్త్ర చికిత్స చేసేందుకు ముందుకొచ్చారు. యువతి శరీరంలోని ఇతర భాగాల నుంచి చర్మం, కొవ్వును సేకరించి బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యంగా ఉండటం వల్ల ఆమెను డిశ్చార్జ్ చేశారు. 48 ఏళ్ల ప్లాస్టిక్ సర్జరీ విభాగం చరిత్రలోనే ఇలాంటి సర్జరీ చేయటం ఇదే తొలిసారని ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ పాలకూరి లక్ష్మి పేర్కొన్నారు.
48 ఏళ్ల చరిత్రలో మొదటిసారి..
నల్గొండ జిల్లాకు చెందిన ఓ 18 ఏళ్ల యువతి బ్రెస్ట్ హైపోప్లాసియాతో బాధపడుతోంది. చాలా చోట్ల చూపించుకున్న యువతి.. ఉస్మానియాలో ఆ సమస్యకు వైద్యం జరుగుతుందని తెలిసి మమ్మల్ని సంప్రదించింది. వెంటనే ఆ అమ్మాయికి అన్ని పరీక్షలు నిర్వహించాం. బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయాలని నిర్ధరించి.. సూపరింటెండెంట్ నాగేంద్రకు వివరించాం. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. డాక్టర్ పాండునాయక్ బృందం సహకారంతో.. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశాం. ఇప్పటికి 15 రోజులు పూర్తయ్యాయి. బాధితురాలు ఆరోగ్యంగా ఉంది. 48 ఏళ్లలో ఇలాంటి ఆపరేషన్ మొదటిసారి విజయవంతంగా చేయటం ఆనందంగా ఉంది." - డాక్టర్ పాలకూరి లక్ష్మి, ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతి
పేదల పెద్దాసుపత్రి ఉస్మానియా..
"ఉస్మానియాలో అన్ని రకాల రోగాలకు వైద్యం అందిస్తామన్న సంకేతం జనాల్లోకి తీసుకెళ్లటం మా ఉద్దేశం. పేదల పెద్దాసుపత్రి ఉస్మానియా. ఇక్కడ కూడా అన్ని రకాల వైద్యాలు అందుబాటులో ఉన్నాయి. పేదలు తన స్థోమతకు మించి ఖర్చు చేసి.. కార్పోరేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా.. ఉస్మానియాలో ఉన్న నిష్ణాతులైన వైద్యుల సహకారాన్ని పొందాలని కోరుతున్నా. అరుదైన కాస్మోటిక్ సర్జరీ చేసిన డాక్టర్ లక్ష్మి బృందానికి నా అభినందనలు." - డాక్టర్ నాగేంద్ర, ఉస్మానియా సూపరింటెండెంట్
ఇదీ చూడండి: