ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర వార్షిక బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజలను భ్రమల్లో ఉంచేలా బడ్జెట్ రూపొందించారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే అంకెల పుస్తకంలా... బడ్జెట్ ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అప్పుల భారాన్ని విపరీతంగా పెంచబోతున్నారని భట్టి.... దుయ్యబట్టారు.
2021-22 బడ్జెట్ మేడిపండులాగా ఉందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఎన్నికల వేళ ఇచ్చిన ఏ హామీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని విమర్శించారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులకు ప్రభుత్వం ఖర్చు పెట్టేదానికి సంబంధం లేదని... ఎమ్మెల్యే రాజాసింగ్ ఎద్దేవా చేశారు. సభలో తమకు తగినంత సమయం కేటాయించి రంగాల వారీగా బడ్జెట్ పై సమగ్ర చర్చ జరపాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్... అంకెలకు, అప్పులకు ఆకాశమే హద్దులా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. ఆచరణ సాధ్యంకాని లెక్కలతో ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతోందన్నారు. ప్రస్తుతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే లక్ష కోట్లకు పైగా అప్పులు చేసి... మొత్తం అప్పులను మూడున్నర లక్షల కోట్లకు పెంచడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూపాయి కేటాయించలేదని విపక్ష నేతలు విమర్శించారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిపై స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం నిరాశ పరిచిందని తెలిపారు.