ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 100 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఎండీ ఎం.చంద్రమోహనరెడ్డి ఆర్కిటెక్ట్‌లతో కలిసి ప్రాజెక్టు వద్ద పలు ప్రదేశాలను పరిశీలించి వెళ్లారు. ఆదివారం చెన్నై నుంచి రవికుమార్ అసోసియేట్స్‌కు చెందిన ఆర్కిటెక్ట్ రవికుమార్‌నారాయణ్‌ను తీసుకొచ్చారు.
ఆయన విగ్రహం ఏర్పాటు చేసే కొండతో పాటు చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దానిపై ముఖ్యమంత్రితో చర్చించాక ఆయన ఆలోచనకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు డీఈ కె.బాలకృష్ణమూర్తి, ఏపీ ఆర్కిటెక్ట్ విభాగం జీఎం డి.బలరామ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.