ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్ డివిజన్లోని ఓ తెరాస నేత ఇంట్లో కుటుంబ పెద్దలందరూ 20 రోజుల వ్యవధిలో వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్‌కు సంబంధించిన లక్షణాలతోనే ఈ మరణాలు సంభవించాయని పలువురు అనుమానం వ్యక్తం చేయగా... కుటుంబ సభ్యులు వాటిని ఖండిస్తున్నారు.
తెరాస నాయకుడు మహమ్మద్ ముసా తండ్రి ఈ నెల 7న గుండెపోటుతో బాధపడగా... విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రికి తీసుకెళ్లాగా బ్లాక్ డెడ్ అని ఆసుపత్రి వర్గాలు రాసి ఇచ్చారు. అదే రోజు సాయంత్రం మహమ్మద్ ముసా దగ్గు, జ్వరం, శ్వాసకోశ సంబంధ సమస్యలతో హైటెక్‌సిటీలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో బెడ్ కోసం లక్షలు వెచ్చించి చేరారు. చికిత్స పొంది ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత తిరిగి అతను అనారోగ్యానికి గురయ్యారు.
ఇదిలా ఉండగా మూసా తండ్రి మృతి చెందిన వారం లోపు ఆయన నాయనమ్మ, బాబాయ్ 3 రోజుల వ్యవధిలో మృత్యువాత పడ్డారు. మహమ్మద్ ముసా వైద్యం చేయించుకోవటానికి నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి దాదాపు రూ.18 లక్షలు వెచ్చించారు. అయినా ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. ముసా మాత్రం నిమోనియా వ్యాధితో బాధపడుతూ చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మూసకు భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.