సింగరేణిలో ఫిట్టర్ ట్రైనీ, ఎలక్ట్రికల్ ట్రైనీ, వెల్డర్ ట్రైనీ, టర్నర్ మెషినిస్టు, మోటార్ మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, జూనియర్ స్టాఫ్ నర్సు వంటి 305 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వయోపరిమితి, విద్యార్హతలు, జీతభత్యాలు, ఫీజు చెల్లింపు మొదలైన వివరాలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వెబ్సైట్ (www.scclmines.com) లో తెలుసుకోవచ్చని సింగరేణి అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు శుక్రవారం 3 గంటల నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అన్ని ఉద్యోగాలకు 30 సంవత్సరాలు వయోపరిమితి విధించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు సడలింపు ఇచ్చారు. ఇంటర్నల్ అభ్యర్థులకు వయోపరిమితి నిబంధన, ఫీజు చెల్లింపు వర్తించదని సింగరేణి అధికారులు తెలిపారు. దరఖాస్తు రుసుము రూ.200లు ఆన్లైన్ ద్వారా చెల్లించాలని సూచించారు.
సింగరేణి ఉద్యోగ నియామకాలు తెలంగాణ ప్రాంత, ముఖ్యంగా సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నిరుద్యోగులకు సువర్ణ అవకాశమని... సీఎండీ శ్రీధర్ అన్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించుకోవాలని నిరుద్యోగులకు సూచించారు. కేవలం రాత పరీక్ష ద్వారానే ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరు చెప్పినా... నమ్మొద్దని సూచించారు. అలాంటి వారి సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: రూ.26కోట్ల విలువైన మున్సిపాలిటీ భూములు మాయం..