వ్యవసాయ పంటల సాగులో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించుకోవడం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ఆశిస్తున్న 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధించవచ్చని భారత వ్యవసాయ పరిశోధన మండలి - ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ వరి పరిశోధన సంస్థలో సొసైటీ ఫర్ ప్లాంట్ బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ ఆధ్వర్యంలో సమగ్ర మొక్కల జీవ రసాయన, జీవ సాంకేతిక పరిజ్ఞానంపై జరిగిన సదస్సుకు డీజీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇప్పటికే స్వయం సమృద్ధి సాధించిన దృష్ట్యా వ్యవసాయ వృక్షం నీడన ఇది సాధించడం పెద్ద కష్టం కాదని, రాబోయో రోజుల్లో ఆహార భద్రతకు ఢోకా లేదని స్పష్టం చేశారు.
రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ పద్మభూషణ్ ప్రొఫెసర్ జి.పద్మనాభన్, ఐసీఏఆర్ అనుబంధ పరిశోధన సంస్థల సంచాలకులు, శాస్త్రవేత్తలు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరయ్యారు. దేశంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో సమగ్ర మొక్కల జీవ రసాయన, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఉత్తమ ఫలితాలు సాధించడంపై నిపుణులు చర్చించారు.