కరోనా లాక్డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల వలస కార్మికులను తెలంగాణ బిడ్డలుగా భావించి అన్ని రకాలుగా ఆదుకున్నామని తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు లోక్‌సభలో తెలిపారు. ప్రపంచమంతా కరోనా వైరస్ తో అతలాకుతలమవుతున్న వేళ... దేశంలోనూ అందరు చాలా ఇబ్బందులు పడ్డారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రభుత్వం, ఐసీఎంఆర్ ఇచ్చిన సూచనలను అమలు చేస్తూ తెలంగాణ ముందుకు పోయిందన్నారు.
వలస కార్మికులకు ఇబ్బందులు లేకుండా... వసతి కల్పించటంతో పాటు ఉచితంగా నిత్యవసర సరుకులు అందించామన్నారు . ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించటంతో పాటు మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన వైద్యులకు, నర్సులకు, పారిశుద్ధ్య కార్మికులకు అదనంగా 10 శాతం జీతం ఇచ్చామని సభకు నామా వివరించారు.