Nabard Deccan Haat Of Handloom Handicrafts in hyderabad: నాబార్డు ఆధ్వర్యంలో 9వ జాతీయ స్థాయి దక్కన్ హాట్ సందడి హైదరాబాద్ వేదికగా సాగుతోంది. సికింద్రాబాద్ ఆర్య వైశ్య అభ్యుదయ సంఘం మందిరంలో తొమ్మిది రోజులు జరగనున్న ఈ మేళాను తొలిరోజు నాబార్డు సీజీఎం సుశీల చింతల లాంఛనంగా ప్రారంభించారు. ఈ జాతీయ మేళాలో 13 రాష్ట్రాల నుంచి చేనేత, హస్తకళల కళాకారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వయం సహాయ మహిళా బృందాల సభ్యులకు సంబంధించిన 100 స్టాళ్లు కొలువు తీరాయి. ప్రధాని మోదీ పిలుపు మేరకు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇస్తున్న నేపథ్యంలో తమ ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలు చేపట్టారు. నాబార్డు సహకారంతో పచ్చళ్లు, చిరుధాన్యాలు, పప్పులు, అందమైన విగ్రహాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
దేశంలో.. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన లక్ష్యాల మేరకు జాతీయ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు కూడా రుణాలు ఇస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు, శీతల గిడ్డంగులు నిర్మించుకోవడంతోపాటు తమ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కోసం సహయం చేస్తున్నాయి.
హస్త కళలు, చేతి వృత్తుల కళారూపాలు, చేనేత వస్త్రాల, ఇతర వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను విస్తృతం చేసి ఆయా కుటుంబాల్లో నాణ్యమైన జీవనోపాధులు పెంపొందించేందుకు నాబార్డు కృషి చేస్తోంది. దేశ నలుమూలల నుంచి లభ్యమయ్యే అద్భుతమైన చేనేత వస్త్రాలు, చేతి వృత్తుల కళారూపాలు, వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో ఉండటంతో... సందర్శకులు అవి కొనుగోలు చేసేందుకు తరలివస్తున్నారు. దక్కన్ హాట్ ఈ నెల 9 వరకు కొనసాగనుంది.
ఇవీ చదవండి: