ఏపీ సీఎం జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. శాసనమండలిని రద్దు చేయాలని కోరారు. శాసనమండలిలో వైకాపాకు మెజార్టీ పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో మండలిని రద్దు చేస్తే మీపై గౌరవం పెరుగుతుందని లేఖలో ప్రస్తావించారు. 'మీ అభిమానులు అంతా.. మాట తప్పారు.. మడమ తిప్పరు అనుకుంటారు. మండలి నిర్వహణకు రూ. 60 కోట్ల ఖర్చు వృథా అని అన్నారు. మరీ దాని సంగతేంటని' రఘురామ గుర్తు చేశారు.
ఏపీ సీఎం జగన్ గారికి లేఖ రాశాను. అందులో శాసనమండలిని రద్దు చేయాలని కోరాను. మండలి రద్దుపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిత్యం స్పందిస్తున్నారు. తాజాగా మండలి రద్దుపై వెనక్కి తగ్గేది లేదని నలుగురు నూతన శాసనమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగానూ చెప్పారు. అందుకు సీఎం జగన్ తో పాటు.. ఆయన వాణి వినిపించిన సజ్జలకు నా శుభాభినందనలు. వారి ఆశయ సాధనకై మండలి రద్దుకోసం పని చేస్తాను - ఎంపీ రఘురామకృష్ణరాజు
మండలి రద్దుపై తీర్మానం.. ఏం జరిగిందంటే...
ఏపీలో శాసన మండలి రద్దుపై శాసనసభ తీర్మానం చేసింది. గతేడాది జనవరి 27వ తేదీన.. తీర్మానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఒక్కరోజు చర్చతోనే మండలికి మంగళం పాడింది. కేబినెట్ భేటీలో మండలిని రద్దుపై తీర్మానం చేసిన అదే రోజూ.. శాసనసభ ఆమోద ముద్రను వేసింది. తీర్మానాన్ని జగన్ ప్రవేశపెట్టగా.. సభాపతి చర్చకు అనుమతి ఇచ్చారు. ప్రతిపక్ష తెదేపా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించంటంతో.. అధికార పార్టీతో పాటు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడారు. సభలో ప్రసంగించిన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ తీర్మానాన్ని బలపరిచారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న విధాన పరిషత్‌ను రద్దు చేయాలని కోరారు. జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన మండలి.. అలాంటి వాటికి కేంద్రంగా మారిందని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండలిని పునరుద్ధరిస్తే.. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సభ సాక్షిగా తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. సభలో నాడు చంద్రబాబు మాట్లాడిన వీడియో టేపులను ప్రదర్శించారు. తీర్మానంపై మాట్లాడిన సీఎం జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మండలిలో చేసిన సవరణలను శాసనసభ ఆమోదించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. విధాన పరిషత్ రద్దు తీర్మానానికి ప్రతి ఒక్కరూ మద్దతిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తన ప్రసంగాన్ని ముగించారు.
మండలి రద్దు తీర్మానంపై ఓటింగ్..
మండలి రద్దు తీర్మానంపై శాసనసభలో ఓటింగ్ చేపట్టారు. మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ మినహా మిగతా సభ్యులందరూ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. 133 మంది సభ్యులు మండలి రద్దుకు మద్దతు తెలిపారు. ఈ తీర్మానాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపారు. ప్రస్తుతం ఈ అంశం కేంద్రం పరిధిలో పెండింగ్‌లో ఉంది.
ఇదీ చదవండి: KCR ON CORONA: రెండే రెండు గోళీలు వాడిన... కరోనా ఖతమైంది