ఎంపీ రఘురామకృష్ణరాజు సీఐడీపై తప్పుడు, ఊహాజనిత ఫిర్యాదులు చేసి వాటిని ప్రజాబాహుళ్యంలో వ్యాప్తి చేస్తూ దర్యాప్తు సంస్థను బెదిరించేలా వ్యవహరిస్తున్నారని సీఐడీ ప్రధాన కార్యాలయం పేర్కొంది. ఈ వ్యవహారాలన్నింటినీ సుప్రీంకోర్టుకు నివేదిస్తామని వివరించింది. ఈ మేరకు సోమవారం సీఐడీ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. రఘురామను అరెస్టు చేసిన తర్వాత నిర్దేశిత విధానాల ప్రకారమే ఆయన సెల్‌ఫోన్‌ను సీజ్ చేశామని పేర్కొంది. అది ఐఫోన్ 11 ప్రొ మాక్స్ అని, అందులో 9000911111 నంబరుతో ఎయిర్‌టెల్ సిమ్ ఉందని రఘురామ వాంగ్మూలం ఇచ్చారని తెలిపింది. మే 15న సాక్షుల సమక్షంలో సీజర్ మెమో సిద్ధం చేసి ఫోన్‌ను సీల్డ్ కవర్‌లో ఉంచామని పేర్కొంది. ఈ వివరాలన్నింటినీ గుంటూరులోని సీఐడీ కోర్టుకు అప్పుడే నివేదించామని వివరించింది. సీల్డ్ కవర్‌లోని ఫోన్‌ను విశ్లేషణ కోసం మే 18న ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలకు (ఏపీఎఫ్‌ఎస్‌ఎల్) పంపించామని వెల్లడించింది. ‘రఘురామ దిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సీఐడీ అధికారులు 9000922222 సిమ్ ఉన్న సెల్‌ఫోన్ సీజ్ చేశారని పేర్కొన్నట్లు మీడియా ద్వారా తెలిసింది. ఫోన్ సీజర్ మెమో సిద్ధం చేసిన సమయంలో ఆయన ఇచ్చిన వాంగ్మూలానికి ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. మే 18 నుంచి ఫోన్, సిమ్ ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఆధీనంలోనే ఉంది. సీఐడీ దానిని వినియోగించే అవకాశం లేదు. ఇప్పటివరకూ అందులో ఏ నంబరు సిమ్ ఉందో సీఐడీకి తెలియదు. ఫోరెన్సిక్ ప్రయోగశాల నుంచి తుది నివేదిక వస్తేనే ఆ వివరాలు వెల్లడవుతాయి’ అని తెలిపింది.
మరోవైపు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. సెక్షన్ 124ఎ రద్దుకు ఆప్ సభ్యులు డిమాండ్ చేయాలని కోరారు. మే 14న ఏపీ సీఐడీ పోలీసులు తనను క్రూరంగా హింసించారని లేఖలో ప్రస్తావించారు.
స్వతంత్ర భారత చరిత్రలో.. తొలిసారి 124ఎ సెక్షన్ కింద ఒక ఎంపీని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని రఘురామ పేర్కొన్నారు. 124ఎ సెక్షన్‌ను రద్దు చేసేందుకు పూర్తి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చదవండి : Curfew extend: ఏపీలో ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు