monkeypox : మంకీపాక్స్ చికిత్సకు నోడల్ కేంద్రంగా హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రిని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రంలోని ఒక్క మంకీపాక్స్ కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. అనుమానిత లక్షణాలతో ఉన్నవారు కూడా రాష్ట్రానికి రాలేదని చెప్పారు. దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు కావడంతో అప్రమత్తమైనట్లు తెలిపారు.
రోగ నిర్ధారణ కోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, అనుమానితులకు హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిలో తక్షణ చికిత్స అందిస్తామని వెల్లడించారు. మంకీపాక్స్‌పై వివరాలు, సలహాల కోసం 04024651119, 9030227324 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
మరోవైపు.. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. వర్షాలు, వరదల కారణంగా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశముందన్న మంత్రి... రాబోయే 10రోజులు అన్ని ఆసుపత్రుల్లో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అవసరమైతే ఓపీ సమయాన్ని పెంచి..ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.
తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్లు 24 గంటలు పనిచేయాలని ఫలితాలను వీలైనంత వేగంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త డైట్ మెనూను..ప్రతి ఆసుపత్రుల్లో ప్రదర్శించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులందరికీ కొవిడ్ బూస్టర్ ఇవ్వాలని ఆదేశించారు.