ఇంటర్ చదువుతున్నప్పుడు ముంబయికి చెందిన మోనికా జీవితంలో మర్చిపోలేని విషాదం చోటు చేసుకుంది. వేగంగా కదులుతున్న రైలుని ఎక్కే ప్రయత్నంలో అదుపుతప్పి ప్లాట్‌ఫామ్‌కీ రైలుకీ మధ్యలో పడిపోయింది. దాంతో రెండు చేతులూ మోచేతి కింద నుంచి నుజ్జునుజ్జయ్యాయి. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకోవడానికి ఆరు నెలలు పట్టింది. చేతుల్లేని తనను చూసుకుని కుంగుబాటుకు గురై తన గది నుంచి బయటకు రావడమే మానేసింది. అవయవదానం కింద ఎవరైనా చేతులు దానం చేస్తే అమర్చవచ్చన్నారు వైద్యులు. అయినా దానికయ్యే ఖర్చును భరించడం ఆ కుటుంబానికో సవాలుగా మారింది.
దాతల సాయంతో..
ఆర్థిక చేయూత కోసం అయిన వాళ్లనూ, ఎన్నో ఎన్జీవోలను అభ్యర్థించినా లాభంలేకపోయింది. మోనికా తండ్రి ఆ బెంగతోనే గతేడాది జనవరిలో గుండెపోటుతో చనిపోయారు. అప్పుడే ముంబయిలోని గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ ఖర్చును క్రౌడ్ ఫండ్ ద్వారా పొందే అవకాశం ఉందని చెప్పారు. ‘రెండేళ్ల కిందట వైద్యపరీక్షలకు వెళ్లినప్పుడు వైద్యులు కృత్రిమ చేతుల గురించి చెబితే.. దాత దొరికేలోపు వాటిని అమర్చమని అడిగా. అలా వాటిని అమర్చారు. ఆ కృత్రిమ చేతులతో కంప్యూటర్ మీద పని చేయగలిగేదాన్ని. బీకామ్ పూర్తిచేసి ఓ ఎన్జీఓలో తొమ్మిది నెలలపాటు ఉద్యోగమూ చేశా’ అని చెబుతుంది మోనికా. ఈ ఏడాది ఆగస్టులో దాత దొరకడంతో చికిత్సకు సిద్ధమవ్వాలని వైద్యులు ఆమె కుటుంబానికి తెలియజేశారు.
చెన్నైకి చెందిన 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బ్రెయిన్‌డెడ్ అయ్యాడు. అతడి చేతుల్ని దానం చేయడానికి వారి కుటుంబం ఒప్పుకొంది. 15 గంటలకు పైగా సర్జరీ చేసి మోనికాకు రెండు చేతుల్నీ అమర్చారు వైద్యులు. నెల రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేసింది. ‘ఈ సమయంలో నాన్న లేకపోవడం చాలా బాధగా ఉంది. చాన్నాళ్లుగా శుభకార్యాలకు వెళ్లడం మానేశా. ఇకనుంచి వెళ్తా. కొత్త చేతులకు నాకెంతో ఇష్టమైన గోరింటాకు పెట్టుకుంటా. మంచి ఉద్యోగం సాధించాలనేది నా లక్ష్యం’ అని చెబుతోంది 24 ఏళ్ల మోనిక. ఈమె చేతులు సాధారణంగా పనిచేయడానికి మరో ఏడాదిన్నర పడుతుందంటారు వైద్యులు.