రాష్ట్రవ్యాప్తంగా గతంలో వేలిముద్ర విధానంలో... రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు. కరోనా కారణంగా ఓటీపీ, ఐరిస్ ద్వారా రేషన్ పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఓటీపీ వచ్చేందుకు ఆధార్‌కు ఫోన్ నంబర్ అనుసంధానించుకోవాలని అధికారులు సూచించారు. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన ఓటీపీ, ఐరిస్ ద్వారా రేషన్ పంపిణీ... సామాన్యులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ఐరిస్ విధానానికి వివిధ కేంద్రాల్లో సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఓటీపీ ఆధారంగా ఇవ్వాలంటే గ్రామాల్లో సుమారు 30 శాతం మందికి... ఆధార్‌తో ఫోన్ నెంబర్ అనుసంధానం లేదు. ఓటీపీ రావాలంటే ఫోన్ నెంబర్, ఆధార్ అనుసంధానం తప్పనిసరి. లేదంటే రేషన్ దక్కదనే ఆందోళనతో బ్యాంకులు, ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. చలికి వణుకుతూ తెల్లవారుజాము నుంచే జనం బారులు తీరుతున్నారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఆధార్ కేంద్రం తెరవలేదంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఆధార్‌తో ఫోన్ నంబర్ అనుసంధానం చేసుకునేందుకు లబ్దిదారులు పెద్దఎత్తున ఆధార్ కేంద్రానికి వచ్చారు. నియోజకవర్గంలో ఒకే ఒక్క ఆధార్ కేంద్రం అందుబాటులో ఉండగా.. అది కూడా సకాలంలో తెరవడం లేదని లబ్ధిదారులు నిరసన చేపట్టారు.
ఆదిలాబాద్‌లో రెండురోజులుగా కలెక్టరేట్ సమీపంలో ఆధార్ కేంద్రం వద్ద జనం బారులు తీరుతున్నారు. ఉదయం ఐదు గంటలకే చేరుకొని నానా అవస్థలు పడుతున్నారు. ఆధార్ నమోదు కేంద్రాలు పరిమిత సంఖ్యలో ఉండడం.... కార్డు దారులు వేల సంఖ్యలో ఉండడంతో ఇక్కట్లు తప్పడం లేదు. విధానాలు మారుస్తూ ఇబ్బందులు పెట్టకుండా... పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీ చేయాలని వృద్ధులు కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మీసేవ కేంద్రం వద్ద ఆధార్‌కు ఫోన్ నంబర్ అనుసంధానం చేసేందుకు ప్రజలు బారులు తీరారు. జనం అధికంగా ఉండడంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సివచ్చింది. ప్రజలను ఇబ్బందిపెట్టకుండా పాతపద్ధతిలోనే రేషన్ ఇవ్వాలంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.