ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ నిరుపేద చిన్నారికి వెన్నముక ఆపరేషన్‌కు చేయూతనందించి దాతృత్వాన్ని చాటుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ఆ బాలిక కుటుంబంలో సరికొత్త వెలుగులు నింపారు. ప్రకాశం జిల్లాకు చెందిన పదకొండు సంవత్సరాల చిమ్మల జ్ఞాపిక వెన్నముక సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరింది. జ్ఞాపికకు న్యూరో సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు.
పేద కుటుంబానికి చెందిన జ్ఞాపిక తల్లిదండ్రులకు శస్త్రచికిత్స చేయించే స్థోమత లేదు. బాధిత బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి పలువురు ట్విటర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కవిత.. బాలిక కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడి భరోసా నిచ్చారు. నిమ్స్ వైద్యులతో మాట్లాడి జ్ఞాపికకు మెరుగైన వైద్యఅందించాలని కోరారు. కవిత ప్రత్యేక చొరవ చూపడంతో వైద్యులు బాధిత బాలికకు విజయవంతంగా శస్త్రచికిత్స అందించారు. తమ చిన్నారి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్సీ కవితకు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
- ఇదీ చదవండి : క్షణికావేశంలో భార్య తలపై సుత్తెతో కొట్టి చంపిన భర్త