Inter results in telangana 2022 :ఇంటర్ ఫలితాల వెల్లడిలో బోర్డు నిర్లక్ష్యం విద్యార్థులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోని ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాలపై నిర్లక్ష్యం వహిస్తున్నట్లు మరోసారి స్పష్టమవుతోంది. ఫలితాలు మంగళవారం విడుదల కాగా....కొందరు విద్యార్థులు అన్నింట్లో మంచి మార్కులతో పాసైనా ఒక సబ్జెక్టులో మాత్రం సున్నా రావడం అధికారుల నిర్లక్ష్యానికి ఉదాహరణ.
ఫలితాల విడుదల సందర్భంగా ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ మాట్లాడుతూ.. పొరపాట్లు జరగకుండా ఉండేందుకు మార్కులను డబుల్ చెక్ చేశామని, అందుకే రెండు మూడు రోజులు ఆలస్యమైందని చెప్పారు. అయినా తప్పులు రావడం గమనార్హం. ఫలితాల కోసమే పదవీ విరమణ పొందిన ఒక అధికారిని గత మూడేళ్లుగా ఓఎస్‌డీగా కూడా నియమించుకున్నారు. తప్పులపై లోతుగా విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ వస్తోంది.
ఆర్థికశాస్త్రంలో సున్నా.. ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బద్రి గోపి గత ఏడాది హెచ్‌ఈసీ ఫస్టియర్ పాసయ్యాడు. ఈసారి సెకండియర్‌లో ఆంగ్లంలో 70, తెలుగు-90, చరిత్ర-93, రాజనీతిశాస్త్రంలో 80 మార్కులు రాగా ఆర్థికశాస్త్రంలో సున్నా మార్కులు వచ్చాయి. విద్యార్థి గోపి మాత్రం తాను 80 మార్కులు వస్తాయని ఆశించగా...సున్నా రావడంతో అధ్యాపకుల దృష్టికి తెచ్చాడు. పునఃపరిశీలనకు దరఖాస్తు చేస్తే న్యాయం జరుగుతుందని వారు విద్యార్థికి ధైర్యం చెప్పారు. ఈ విషయం బోర్డు దృష్టికి కూడా వచ్చినట్లు సమాచారం.
సంస్కృతంలో ఫెయిల్.. మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ప్రైవేట్ కళాశాలలో చదివిన హరికిషన్ బైపీసీ ప్రథమ సంవత్సరంలో సాధారణ మార్కులతో పాసయ్యాడు. ద్వితీయ సంవత్సరంలో సంస్కృతంలో సున్నా మార్కులు వచ్చాయి. మిగిలిన నాలుగు సబ్జెక్టుల్లో పాసయ్యాడు. ఆంగ్లంలో 50 మార్కులు సాధించిన ఆ విద్యార్థికి సంస్కృతంలో సున్నా మార్కులు రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఇలా చాలా మందికి సున్నా మార్కులు వచ్చినట్లు సమాచారం.