భారీ వర్షాలతో భాగ్యనగరం అతలాకుతలం అయిందని, జనజీవనం స్తంభించిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎడతెరిపి లేని వర్షాలతో, ఉద్ధృతమైన వరదతో ముంపునకు గురైన ప్రాంతాల్లో ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా తగిన ప్రణాళికలతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.
హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి తలసాని.. వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సుమారు 300 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. మరోరెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బస్తీల్లోని ప్రతి ఇంటికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అందించే దుప్పట్లు, నిత్యావసరాలు పంపిణీ చేయాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. ఎమ్మెల్సీ ప్రభాకర్, నాంపల్లి తెరాస ఇంఛార్జి ఆనంద్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్లు మంత్రి వెంట ఉన్నారు.
- ఇదీ చదవండి : ప్రస్తుతం 80 కాలనీల్లో నీరు ఉంది: కేటీఆర్