రాష్ట్రంలో మొదట పోలీసు, విద్య, వైద్య శాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మూడు శాఖల్లో సుమారు 72 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ కానున్నాయని తెలిపారు. ఒక ఉద్యోగం రాకపోతే మరో ఉద్యోగానికి ప్రయత్నించే అవకాశం ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ సుమారు 91 వేల ఉద్యోగాల ప్రకటన చేసే ముందు ఎంతో కసరత్తు జరిగిందన్నారు. ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని యువత ఎదురు చూస్తున్నందున... నియోజకవర్గాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు.
ఉస్మానియా, కాకతీయ, మహాత్మగాంధీ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన పోటీ పరీక్షల ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఉన్నత విద్యా మండలి కార్యాలయం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లోని శిక్షణ కేంద్రాల్లో విద్యార్థులకు మెటీరియల్ కూడా ఉచితంగా అందించాలని అధికారులకు మంత్రి సూచించారు. శ్రమ ఆయుధమైతే.. విజయం బానిస అవుతుందన్న స్ఫూర్తితో విద్యార్థులు కష్టపడి ఉద్యోగాలు సాధించాలని అన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి : ఎలక్ట్రిక్ బైక్ పేలి ఒకరు మృతి .. ఎక్కడో కాదు మన దగ్గరే
60+ ఏజ్‌లో మోడలింగ్.. కొద్దినెలల్లోనే సూపర్‌స్టార్.. అంతా లాక్డౌన్ మేజిక్!