రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు వీసీలను త్వరలోనే నియమిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. యూనివర్సిటీల్లో వీసీల నియామకం, ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబిత సమాధానం ఇచ్చారు. అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1061 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి పేర్కొన్నారు. వీటిని భర్తీ చేస్తున్న సమయంలో ఏకరూప నిబంధన రూపొందించాలని మార్గదర్శకాలు రావడంతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందన్నారు. ఈ క్రమంలోనే రోస్టర్‌ను రూపొందించాలని యూజీసీ కూడా ఉత్తర్వులిచ్చిందని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత కోర్టులో కేసు ఉన్నందున తమ ఉత్తర్వును ఆపేయాలని యూజీసీ ప్రకటించిందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా యూనివర్సిటీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని వివరించారు. యూజీసీ సూచనల మేరకు యూనివర్సిటీల్లో ఉద్యోగాలు చేపట్టేందుకు.. మార్గదర్శకాలు రూపొందించేందుకు ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో జనవరి 9న ఒక కమిటీని నియమించామని మంత్రి తెలిపారు. కమిటీకి కూడా నివేదికను ప్రభుత్వానికి అందజేసిందని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఉద్యోగ నియామకాలు చేపడుతామన్నారు. ఇక వీసీల నియామకం కూడా త్వరలోనే చేపడతామని తెలిపారు. సెర్చ్ కమిటీలతో సమావేశమై వీసీలను ఎంపిక చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 'ఆరోగ్య కార్యకర్తల కృషికి మనం ఎంత ఇచ్చినా తక్కువే'