Minister Sabitha Indra Reddy: కేంద్ర మంత్రి అమిత్ షా విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాకుండా... విధానాలతో రంగారెడ్డి జిల్లాకు రావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పొలిటికల్ టూరిస్టుగా వచ్చి ఊక దంపుడు మాటలు చెప్పి వెళ్లవద్దని... తెలంగాణకు ఏం చేస్తారో అమిత్ షా రేపు చెప్పాలన్నారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు... ఇవ్వబోమూ అని చెప్పేందుకే వస్తున్నారా అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు, ఐఐఎం, ఐఐటీలు, వైద్య కళాశాలలు ఇవ్వబోమని చెప్పేందుకే వస్తున్నారా అని అన్నారు. గ్యాస్ ధరలు తగ్గిస్తామని, ఐటీఐఆర్ ఇస్తామని రేపు అమిత్ షా చెప్పగలరా అని మంత్రి ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారా లేదా చెప్పాలన్నారు. రాష్ట్రానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఏమి ఇచ్చిందో బండి సంజయ్ శ్వేతపత్రం విడుదల చేస్తే... మహేశ్వరం అభివృద్ధికి కేసీఆర్ సర్కారు చేసిందేమిటో తాము శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.
'మీరు విధానాలతో రాలేదు. విద్వేషాలను రెచ్చగొట్టడానికి భాజపా నాయకులు పాదయాత్ర మొదలుపెట్టారు. విభజన హామీల అమలులో విఫలమయ్యామని చెప్పేందుకే రేపు తెలంగాణకి అమిత్ షా వస్తున్నారా? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుని పూర్తి చేసుకుని దక్షిణ తెలంగాణ బాగు చేసుకోవాలని సీఎం సంకల్పించుకున్నారు. దానికి ఎన్ని అడ్డంకులు సృష్టించారో ఈ రోజు పాదయాత్ర చేస్తున్న భాజపా నాయకులకు తెలువదా? రేపు రాబోతున్న అమిత్‌షాకు తెలువదా?. కృష్ణా నదిలో మా వాటా మాకు కావాలని సీఎం దిల్లీకి వచ్చి ఎన్ని సార్లు కేంద్రప్రభుత్వానికి మొరపెట్టుకున్నారో అమిత్ షా చెప్పాలి. కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్రకి జాతీయ హోదా ఇస్తారు. తెలంగాణలో ఉన్న పాలమూరు రంగారెడ్డికి ఎందుకు ఇవ్వరు? తెలంగాణ ప్రజల పట్ల మీకు వివక్షా, కోపమా, కక్షనా చెప్పాలి.' - సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. భాజపా అంతర్గత సంఘర్షణ యాత్రగా మారిందని సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ సర్కార్ చేసిన మేలు... కేంద్రం విధానాల వల్ల జరిగిన నష్టాన్ని పాదయాత్రలో ప్రజలు బండి సంజయ్‌కి వివరించారని మంత్రి పేర్కొన్నారు. అమిత్ షా ఏ మొహం పెట్టుకొని రంగారెడ్డి జిల్లాకు వస్తున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి, తెరాస రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి:బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా.. 48 గంటల్లో..