రైతువేదికలు వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది కానున్నట్లు కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతువేదిక భవనాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ ఛైర్మన్ శరత్‌చంద్రారెడ్డిలతో కలిసి మంత్రి ప్రారంభించారు. పిర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో చిరువ్యాపారులకు చెక్కులు పంపిణీ చేశారు.
"రాష్ట్రంలో సిద్ధమైన రైతు వేదికలే కర్షక దేవాలయాలు. ఎలాంటి పంటలు వేయాలో అధికారులతో, రైతులతో ముందుగానే చర్చించుకోవడానికి గొప్ప వేదికలను ప్రభుత్వం నిర్మించింది. ఏ పంటలకు ఏ మందులు వేయాలి? ధర ఎంత వస్తుంది? లాంటి అన్ని విషయాలు తెలుస్తాయి. వాణిజ్య పంటలు వేసుకుని లాభాలు గడించవచ్చు. రైతులందరూ వేదికలను ఉపయోగించుకోవాలి. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతుబీమాలతోపాటు చేకూర్చస్తున్న అన్ని ప్రయోజనాల ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుంది. కరోనా వ్యాప్తితో ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోయినా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పాటు పడుతోంది."
-మల్లారెడ్డి, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి
ఇదీ చూడండి: చివరి గంటలో ఓటు వేస్తున్న కరోనా బాధితులు