హైదరాబాద్‌ను 'బిన్ ఫ్రీ సిటీ'గా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. జంటనగరాల్లో ఇంటింటికీ తిరిగి చెత్తను తీసుకెళ్లే 325 వాహనాలను ప్రారంభించారు. పెరుగుతున్న జనాభా, నగర స్వచ్ఛతను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
తెలంగాణపై కరోనా మరోసారి తన పంజా విసురుతున్న వేళ స్వచ్ఛత చాలా అవసరమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. మహానగరాన్ని స్వచ్ఛనగరంగా మార్చేందుకు జీహెచ్ఎంసీ పటిష్ఠ చర్యలు చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగా 650 స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేశారని వెల్లడించారు.
ఇప్పటికే నగరంలో 2,500 స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నగర స్వచ్ఛతపై మరింత దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ సిబ్బందికి సూచించారు.