హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. బల్కంపేటలో రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామాన్ని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. సనత్‌నగర్‌లోని నెహ్రూ పార్క్‌లో థీమ్ పార్కు భూమి పూజ చేశారు. అనంతరం లేబర్ వెల్ఫేర్ సెంటర్ వద్ద క్రీడా సముదాయంతో పాటు... మోండా మార్కెట్ సమీపంలో మరో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంత్రులు ప్రారంభించారు. యువకులతో కలిసి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. అనంతరం మోండా మార్కెట్ ఆదయ్య నగర్‌లో లైబ్రరీ భవనం.. మారేడ్‌పల్లిలో జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించారు.
శాంతి భద్రతల విషయంలో కఠినంగా..
హైదరాబాద్‌లో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రణాళిక బద్ధంగా పనిచేస్తున్నాయమని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో గతంలో కర్ఫ్యూలు ఉండేవని... రాష్ట్రం వచ్చాక శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉన్నామని తెలిపారు. మనందరి హైదరాబాద్‌ను కొందరిగా చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాలవి అర్థంలేని ఆరోపణలు..
హైదరాబాద్ నగరాన్ని కోట్ల రూపాయల వ్యయంతో తక్కువ సమయంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రెండు పడక గదుల ఇళ్లను దశలవారీగా పంచుతామన్న మంత్రి.... ప్రతిపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడ్డారు.
ఆరేళ్లలో తెరాస సర్కార్ హయాంలోజరిగిన హైదరాబాద్ అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్లాలని పార్టీశ్రేణులకు కేటీఆర్ సూచించారు.
ఇవీ చూడండి: రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్