TRS Leaders on Munugode By Election: మునుగోడులో తెరాస అభ్యర్థిగా అధినేత ఎవరిని ఎంపిక చేసినా... కలిసి పనిచేయటంతో పాటు అధిక మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైన మునుగోడులో తెరాస అభ్యర్థిత్వంపై అసమ్మతిరాగం మొదలైన నేపథ్యంలో.. మంత్రి జగదీశ్‌రెడ్డి వారికి నచ్చజెప్పి ఏకాభిప్రాయానికి తీసుకొచ్చారు. రాజగోపాల్‌రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వచ్చిన మునుగోడు ఉపఎన్నికలో.. తెరాస సత్తాచాటి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామని మంత్రి తెలిపారు.
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో మరోసారి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే టికెట్ ఇచ్చేందుకే పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు వచ్చాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన 12 మంది స్థానిక నేతలు.. సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో నేతలకు నచ్చజెప్పే బాధ్యతను అధినాయకత్వం మంత్రి జగదీష్‌రెడ్డికి అప్పగించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో నియోజకవర్గ ముఖ్యనేతలతో సమావేశమైన జగదీశ్‌రెడ్డి వారితో దాదాపు మూడు గంటలు చర్చించారు. అనంతరం అసమ్మతి నాయకులందరినీ ప్రగతిభవన్ తీసుకెళ్లిన మంత్రి.. నచ్చజెప్పి తీసుకువచ్చారు. సీఎం వద్దకు వెళ్లకుండానే నేతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని.. అధినేత ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.
"మునుగోడులో తెరాస నాయకులందరూ ఐక్యంగానే ఉన్నారు. తెరాస అభ్యర్థిని గెలిపించేందుకు నాయకులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం తెరాస, కారు గుర్తే మా అభ్యర్థి. మునుగోడులో తెరాసను గెలిపించాలని ప్రజలు కూడా భావిస్తున్నారు. 50 వేల మెజార్టీతో తెరాస గెలుస్తుంది. ఎమ్మెల్యేగా రాజగోపాల్‌రెడ్డి విఫలమయ్యారు. రాజగోపాల్‌రెడ్డి స్వార్థం కోసమే ఈ ఉపఎన్నిక తెచ్చారు. మునుగోడు తెరాసలో అసంతృప్తులు లేరు." - జగదీశ్‌రెడ్డి, మంత్రి
ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి తెరాస నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు తెరాస ముఖ్యనేతలు సంకేతాలిస్తున్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కర్నె ప్రభాకర్‌ను నియోజకవర్గానికే పరిమితం చేయకుండా రాష్ట్రస్థాయిలో వారి సేవలు వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోందని చెబుతున్నారు. పార్టీ సర్వేలన్నీ కూసుకుంట్లకే ప్రాధాన్యమిచ్చాయని జిల్లాకు చెందిన కొందరు ముఖ్యనేతలు చెబుతున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వైపే మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలోని పలువురు నేతల్లో అసంతృప్తి నెలకొంది.
ఇవీ చూడండి: