రాష్ట్రంలో 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా టీకా వేసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కొవిడ్ వ్యాక్సినేషన్‌పై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల సమీక్షించారు. 45 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ టీకాలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు.
ఇప్పటివరకు వైద్య కళాశాల, టీవీవీపీ ఆసుపత్రుల్లోనే టీకాలు వేశామని... నేటి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉండనుందని స్పష్టం చేశారు. టీకా వేసుకుంటేనే కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోగలమని ఈటల అభిప్రాయపడ్డారు. కరోనా విజృంభిస్తోన్న తరుణంలో... ప్రజలంతా మాస్క్ ధరించడం, భౌతికదూరం మరువొద్దని మంత్రి ఈటల సూచించారు.