TRS Protest : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరువల్లే... ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. పార్లమెంటులో మైకులు ఆపేసి... ఎలాంటి చర్చ జరగకుండానే ఆంధ్రప్రదేశ్ విభజన చేశారని.. అందుకే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని... మోదీ ఆక్షేపించారు.
ఈ వ్యాఖ్యలను మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ సాక్షిగా తెలంగాణను అవమానించే విధంగా ప్రధాని మాట్లాడారని కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని అసంబద్ధ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.
'తెలంగాణ ప్రజల దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని, త్యాగాలను ప్రధాని మోదీ పదే పదే అవమానిస్తున్నారు. ప్రధాని చేసిన అసంబద్ధ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ వ్యాఖలపై తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.'
-ట్విట్టర్లో మంత్రి కేటీఆర్
ఇవాళ నిరసనలు..
మోదీ వ్యాఖ్యల పట్ల ఇవాళ అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. భాజపా దిష్టిబొమ్మలు దహనం చేసి, నల్లజెండాలతో నిరసన తెలపాలని సూచించారు.
ఇదీచూడండి: Harishrao on Modi: 'ప్రధాని మాటలు.. తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచాయి'