మాజీమంత్రి అచ్చెన్నాయుడు విషయంలో చట్టం తన పని చేసుకుపోతోందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెదేపా నేతలు మెుదట చెప్పాల్సింది.. 'నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని కాదు... అక్రమాలు జరగలేదని' చెప్పాలన్నారు. 130 శాతం ఎక్కువకు కొన్నారని నివేదిక స్పష్టం చేసినట్లు వివరించారు. అవినీతిపై పోరాటం చేస్తామని జగన్ ఎన్నికల ముందే చెప్పారని.. మేం చేసింది తప్పయితే న్యాయస్థానాలకు వెళ్లండని బొత్స సూచించారు. మీరు చేసిన అక్రమాలు ఒకటా.. రెండా.. అనేకం ఉన్నాయని విమర్శించారు. భోగాపురం విమానాశ్రయ ఒప్పందంలో 500 ఎకరాలు తగ్గించామని తెలిపారు.
నోటీసు ఇవ్వకుండా ఎవరైనా అరెస్ట్ చేస్తారా..?
తాను కూడా బలహీనవర్గ వ్యక్తినేనని.. తనపై కూడా అనేక నిందలు వేశారని ఈ సందర్భంగా బొత్స గుర్తుచేశారు. బీసీ వర్గాలకు భరోసా ఇచ్చిన పార్టీ తమదేనన్నారు. నోటీసు ఇవ్వకుండా ఎవరైనా అరెస్టు చేస్తారా? అని మంత్రి ప్రశ్నించారు. తెదేపా పాలనపై ఆరోపణలు చేసే తాము అధికారంలోకి వచ్చామన్నారు.
ఒక్కొక్కటీ బయటకు తీస్తున్నాం...
మీకంటే, మాకంటే ప్రజలు చాలా తెలివైనవాళ్లని.... వ్యవస్థలను కాపాడుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బొత్స అన్నారు. మీరు చేసిన అక్రమాలు ఒక్కొక్కటీ బయటకు తీస్తున్నాం... మాకు ఎవరిపైనా కక్ష లేదని, మీ అవినీతిపై ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే చర్యలు తీసుకుంటున్నామని....,పేదల కోసం పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నామని బొత్స పేర్కొన్నారు.
ఇదీ చూడండి: గోదావరి జలదీక్షపై కాంగ్రెస్ రహస్య వ్యూహరచన