Medical Progress Report of 2014-22: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అందరికీ మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ వడివడిగా పయనిస్తోందని ఆరోగ్య శాఖ పేర్కొంది. జాతీయ ఆరోగ్య సూచీల్లో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించిందని స్పష్టం చేసింది. ఒక లక్ష ప్రసవాలకు 2014లో 92 ఉన్న మాతృ మరణాలు.. 2022 నాటికి 56కు తగ్గాయి. ప్రతి 1,000 ప్రసవాలకు 2014లో 39 ఉన్న శిశు మరణాలు.. 2022 నాటికి 23కి తగ్గాయి’’ అని తెలిపింది. మాతృ మరణాలను ప్రతి లక్షకు, శిశు మరణాలను ప్రతి వెయ్యికి లెక్కిస్తారు. ఇదే క్రమంలో 2014లో ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 41 ఉంటే, 2022 నాటికి ఆ సంఖ్య 30కి తగ్గిందని వివరించింది. 2014-22 వరకూ రాష్ట్రంలో వైద్యఆరోగ్య ప్రగతి నివేదికను మంగళవారం ఆ శాఖ విడుదల చేసింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన 4వ ఆరోగ్య సూచీల్లో తెలంగాణ రాష్ట్రం కేరళ, తమిళనాడు తర్వాత 3వ స్థానంలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రభుత్వం చేస్తున్న తలసరి వైద్యఖర్చు రూ.1,698 కాగా ఈ ప్రకారం చూస్తే హిమాచల్‌ప్రదేశ్, కేరళ తర్వాత తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని వివరించింది.
వైద్య విద్యలో గణనీయమైన వృద్ధి : తెలంగాణ ఏర్పడిన నాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలే ఉండేవి. ఆ తర్వాత మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేటల్లో కొత్తగా ప్రభుత్వం స్థాపించింది. జిల్లాకొక వైద్య కళాశాలను నెలకొల్పాలనే సీఎం సంకల్పానికి అనుగుణంగా.. తొలివిడతగా 2021లో సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్, జగిత్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండంలలో ఒక్కోదానికి రూ.510 కోట్ల వ్యయంతో అనుమతులు మంజూరు చేసింది. 2022-23 నుంచే వాటిలో తరగతులు ప్రారంభం కానున్నాయి. 2023-24లో మరో 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది. జిల్లాకొక వైద్య కళాశాల ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 5,240కి, పీజీ సీట్లు 2,500కు, సూపర్ స్పెషాలిటీ సీట్లు 1,000కు చేరుతాయి. ప్రభుత్వం వరంగల్‌లో రూ.1,100 కోట్లతో 2,000 పడకలతో హెల్త్‌సిటీని అభివృద్ధి చేయనుంది. మొత్తం రూ.2,679 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటి 1,000 ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో హైదరాబాద్ నలువైపులా నాలుగు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది’’ అని ఆరోగ్యశాఖ వివరించింది.
డైట్ ఛార్జీలను రోజుకు రూ.40 నుంచి రూ.80కి పెంచాం : ‘‘గతంలో మూడంచెల వైద్యసేవలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం అయిదంచెలుగా విస్తరించారు. ప్రాథమిక సేవలకు పీహెచ్‌సీలు, ద్వితీయ స్థాయి సేవలకు జిల్లా ఆసుపత్రులు, స్పెషాలిటీ సేవలకు బోధనాసుపత్రులు ఉన్నాయి. వీటికి అదనంగా బస్తీ/పల్లె దవాఖానాలు, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలకు టిమ్స్‌లు వస్తున్నాయి. ప్రాథమిక స్థాయిలో మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 4,745 సబ్‌సెంటర్లను పల్లె దవాఖానాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 42 రక్తశుద్ధి కేంద్రాలను నెలకొల్పింది. వీటి సంఖ్యను త్వరలో 102కు పెంచనుంది. 21 ఆసుపత్రుల్లో సీటీస్కాన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గుండె సంబంధిత శస్త్రచికిత్సలు నిర్వహించడానికి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ ఆసుపత్రుల్లో క్యాథ్‌ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చింది. ప్రతి పడకకూ చేస్తున్న ఖర్చును రూ.5వేల నుంచి రూ.7,500లకు పెంచింది. సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలను రోజుకు రూ.40 నుంచి రూ.80లకు పెంచింది’’ అని ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇదీ చదవండి: TRS: నేటి మమతా బెనర్జీ సమావేశానికి తెరాస దూరం