Pedakakani malleswara swamy temple: ఏపీ గుంటూరు జిల్లా పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న క్యాంటిన్‌లో మాంసాహారం వండటం కలకలం రేపింది. నిత్యం ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడి క్యాంటిన్‌లో అల్పాహారం తయారు చేస్తుంటారు. అన్నదానానికి కూడా ఇక్కడి నుంచి భోజనం సరఫరా చేస్తారు. ఇప్పుడు అదే క్యాంటిన్‌లో కోడి మాంసం వండటం విమర్శలకు తావిచ్చింది.
క్యాంటిన్ నిర్వహణను ఓ ప్రైవేటు వ్యక్తి వేలంపాటలో దక్కించుకున్నాడు. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ నేతకు క్యాటరింగ్ వ్యాపారం ఉంది. తనకు వచ్చిన ఆర్డర్లను ఇక్కడే వండి సరఫరా చేస్తుంటాడు. ఇదే క్రమంలో గురువారం ఆలయం ప్రాంగణంలో ఉన్న క్యాంటిన్‌లోనే మాంసాహారం తయారు చేయించి బయటకు పంపించారు. భక్తుల్లో ఒకరు ఇది గమనించి ఫొటోలు తీశారు. విషయం ఆలయ అధికారుల దృష్టికి వచ్చినా వారు నోరు మెదపడం లేదు. క్యాంటిన్ నిర్వాహకులను పిలిచి వివరణ అడిగినట్టు సమాచారం. అయితే, మాంసాహారం బయటే వండానని, ఆర్డర్ ఇచ్చే వారికి అందజేసే క్రమంలో మాంసాహారం ఉన్న రిక్షా లోపలికి వచ్చిందని అధికారులకు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆలయ వర్గాలతో పాటు స్థానికులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. అయితే, అధికార పార్టీ నేత కావడం వల్ల నోరు మెదిపేందుకు జంకుతున్నారు.
ఇదీ చదవండి: Private hospitals: 19 ప్రైవేటు ఆసుపత్రుల అనుమతులు రద్దు