మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్‌జడ్‌సీ) కార్యదర్శి ఎంపిక కోసం ఆ పార్టీ అగ్రనేతలు కసరత్తు ముమ్మరం చేశారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో(ఎస్‌ఐబీ) వర్గాలకు ఇప్పటికే సమాచారం అందింది. అందుకోసం ఈనెల 18, 19, 20 తేదీల్లో సుక్మా, బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ జిల్లాలకు చెందిన వేల మంది స్థానికులతో దండకారణ్యంలోని బస్తర్ అడవుల్లో భారీ సమావేశం జరిగినట్లు తెలిసింది.
సమావేశాలు నిర్వహణ
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. దండకారణ్యంలో బలం చాటడం వల్ల కార్యదర్శి ఎంపిక కోసం సమాలోచనలు జరిపేందుకు ఈ సమావేశాలు నిర్వహించారు. కేంద్ర కమిటీ సభ్యులు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, కోసా, హరిభూషణ్, మావోయిస్టు బెటాలియన్ నం.1 కమాండ్ మండావి హిడ్మా, కిషన్‌జీ భార్య సుజాత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని పోలీస్ క్యాంపుల నుంచి అపహరించిన ఆయుధాల్ని ప్రదర్శించారు. 2015లో జరిపిన భారీ బహిరంగ సభ తర్వాత మళ్లీ అంత భారీ ఎత్తున సభ నిర్వహించడం ఇదే తొలిసారి అని భావిస్తున్నారు.
ముందే సమాలోచనలు
గత డిసెంబరులో అప్పటి డీకేఎస్‌జడ్‌సీ కార్యదర్శి రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న అనారోగ్యంతో మృతిచెందిన తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. ప్రస్తుతం మావోయిస్టు కార్యకలాపాలన్నీ దండకారణ్యం కేంద్రంగానే నడుస్తుండటం వల్ల ఆ స్థానాన్ని భర్తీ చేయడం పార్టీకి అవశ్యంగా మారింది. అందుకే ప్రత్యేకంగా ప్లీనం నిర్వహించి సమాలోచనలు జరిపారని పోలీసులకు సమాచారం అందింది. ప్రస్తుతం తెలంగాణ పార్టీ కార్యదర్శిగా ఉన్న యాప నారాయణ అలియాస్ హరిభూషణ్‌కు ఆ బాధ్యతలు అప్పగించేందుకు అగ్రనాయకత్వం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. కేంద్ర కమిటీ తీర్మానం తర్వాతే మావోయిస్టులు అధికారికంగా పేరును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చూడండి : భూమ్యాకాశాలపై ఇంకేమైనా మిగిలి ఉన్నాయా..: హైకోర్టు