హైదరాబాద్ కుత్బుల్లాపూర్ వాజ్‌పేయ్ నగర్లో తాగునీరు కలుషితమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది రోజులుగా మంజీర నీరు డ్రైనేజీ నీటిని తలపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మంచినీరు రావాల్సిన పైపుల నుంచి డ్రైనేజీ నీరు వస్తుందని ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని... కనీసం స్పందించడం లేదంటూ కాలనీవాసులు తెలిపారు.
నీరు వచ్చినప్పుడల్లా నల్లగా రావడమే కాకుండా... దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం పక్క కాలనీలకు వెళ్లవలసి వస్తుందని, మంజీర లైను డ్రైనేజీకి సమీపంలో ఉండడం వల్ల ఈ పరిస్థితి నెలకొందన్నారు. వర్షాకాలం కావడం వల్ల సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని... వృద్ధులు, చిన్నపిల్లలు తమ ఇళ్లలో ఉన్నారని తమ గోడు వెలిబుచ్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే తమ సమస్యను తీర్చాలని కోరారు.