- హుబ్లీకి చెందిన ప్రభుత్వ వైద్యుడికి(45), ఇండోర్‌కు చెందిన ఓ యువకుడికి వేర్వేరుగా కరోనా సోకింది. ఆసుపత్రిలో కొన్ని రోజుల చికిత్స తర్వాత ఆరోగ్యం విషమించి ఊపిరితిత్తులు గట్టిగా(పైబ్రోసిస్) మారాయి. మార్పించడం ఒక్కటే పరిష్కారమని వైద్యులు సూచించారు. కొన్ని రోజుల కిందట ఎయిర్ అంబులెన్సులో ఇరువుర్నీ హైదరాబాద్ తరలించారు. ఊపిరితిత్తుల మార్పిడితో ఇద్దరూ కోలుకున్నారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన రెసిడెంట్ డాక్డర్ శారదాసుమన్(32)కు ఏప్రిల్ 14న కొవిడ్ సోకింది. వైరస్ తగ్గినా ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. గర్భవతి కావడంతో మే 1న అత్యవసర శస్త్ర చికిత్స చేసి శిశువును రక్షించారు. ప్రసవానంతరం ఆమెకు ఎక్మోపై చికిత్స అందించారు. కోలుకోకపోవడంతో ఊపిరితిత్తులు మార్పిడే శరణ్యమని వైద్యులు నిర్ణయించారు. ఇటీవల హుటాహుటిన ఎయిర్ అంబులెన్సులో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
కీలకంగా హైదరాబాద్...
ఇలా దాదాపు 20-25 మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొవిడ్ బాధితులకు నగరంలోని వేర్వేరు కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. ఒకప్పుడు ఈ ఆపరేషన్లకు చెన్నైని ఎంచుకొనేవారు. ప్రస్తుతం హైదరాబాద్ కీలకంగా మారిందని వైద్యులు తెలిపారు. ముంబయి, దిల్లీ కంటే మనవద్దే మెరుగైన వైద్య వసతులున్నాయని పేర్కొన్నారు. నిపుణులైన వైద్యులూ అందుబాటులో ఉండడంతో నగరంలో ఎక్కువ సంఖ్యలో మార్పిడి చికిత్సలు చేస్తున్నారు. అవయవదానంపై అవగాహన కల్పించడానికి ఏర్పాటైన జీనన్‌దాన్ ట్రస్టు ఇందులో కీలకంగా వ్యవహరిస్తోంది. నిమ్స్ ఇందుకు నోడల్ కేంద్రంగా ఉంది. అవసరమైన అవయవం కోసం తొలుత ఇక్కడ నమోదు చేయించుకోవాలి. జీవన్‌దాన్ నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఎవరైనా జీవన్మృతులుగా మారితే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానానికి ముందుకొచ్చేలా అవగాహన కల్పిస్తారు. అవయవాల తరలింపులోనూ పోలీసులు మానవతా దృక్పథంతో స్పందిస్తున్నారు. అతి తక్కువ సమయంలో దూరప్రాంతాల నుంచి అవయవాలను తరలించడానికి గ్రీన్‌ఛానల్ ఏర్పాటు చేస్తున్నారు.
భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం...
కరోనా సోకిన కొందరి ఊపిరితిత్తుల్లో తీవ్ర సమస్య ఏర్పడుతోంది. మెత్తటి దూదిలా ఉండాల్సిన ఊపిరితిత్తులు గట్టిపడుతున్నాయి. వెంటిలేటర్, ఎక్మోతో 25 శాతం మంది కోలుకొనే అవకాశం ఉంటుంది. మిగతా వారిలో ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటే శరణ్యం. భారీ ఖర్చుతో కూడుకున్నది కావడంతోపాటు సమయానికి దాత దొరకడం చాలా కష్టం. ఖర్చు భరించే స్థితిలో ఉన్నవారే ముందుకొస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ వైద్యురాలికి ఈ చికిత్స చేయించేందుకు ఆ ప్రభుత్వం ముందుకొచ్చింది. కరోనా ఎవరిలో ఎలా స్పందిస్తుందో స్పష్టం కాకపోవడంతో, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం తదితర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి కరోనా సోకితే అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడంతోపాటు, కొవిడ్ సోకకుండా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
ఆఖరి ప్రయత్నంగానే మార్పిడి
ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సల్లో దేశంలోనే హైదరాబాద్ ముందుంది. ఇది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఒకసారి మార్పిడి చేసిన 50 శాతం కేసుల్లో అయిదేళ్ల వరకు సర్వైవల్ రేటు ఉంటుంది. పదేళ్లు సర్వైవల్ 10 శాతం మాత్రమే. దాదాపు మృత్యు ముఖం వరకు వెళ్లిన వ్యక్తి ఊపిరితిత్తుల మార్పిడితో బతుకుతున్నారు. కరోనా పూర్తిగా విడిచి వెళ్లే వరకు జాగ్రత్తలు పాటించాలి. టీకా వేయించుకోవాలి.. జాగ్రత్తలు పాటించాలి.
- డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు, అపోలో