రాష్ట్రంలో ఫాక్స్ మశూచి గ్రూపునకు చెందిన వైరస్ వల్ల "లంపీ స్కిన్ వ్యాధి" పశువుల్లో అక్కడక్కడా కనిపిస్తున్నట్లు పశుసంవర్థక శాఖ గుర్తించింది. వ్యాధి తీవ్రత దూడల్లో అధికంగా ఉంటుందని... జాగ్రత్తగా చికిత్సలు చేయిస్తే మరణాలు అరికట్టవచ్చని... పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ వంగాల లక్ష్మారెడ్డి సూచించారు. సంతలో కొనుగోలు చేసిన పశువుల ద్వారా ఇతర పశువులకు ఈ వ్యాధి సోకుతుందన్నారు. ఒకవేల వ్యాధి సోకితే వారం రోజులపాటు వేరుగా ఉంచి వైద్య సేవలు చేయించినట్లైతే అరికట్టవచ్చన్నారు.
ఈ వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వం అన్ని జిల్లాలకు రెండు విడతల నిధులు మంజూరు చేసిన దృష్ట్యా... రైతులెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో పశుసంవర్థక శాఖ వైద్యులు, సిబ్బందిని గ్రామాలకు పంపించి లంపీ స్కిన్ వ్యాధి అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో రాష్ట్ర వీబీఆర్‌ఐలో తయారు చేసిన గోట్ ఫాక్స్ టీకాలు పశువుల్లో వేయించామని చెప్పారు.
ఇది జోనెటిక్ వ్యాధి కానందున మనుషులకు సోకే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ఇది ఓ చర్మ వ్యాధి అని... వ్యాధి సోకిన పశువుల మాంసం విలువ, నాణ్యతలో ఎలాంటి సమస్య ఉండదని... ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.