ఆంధ్రప్రదేశ్లోని విశాఖ మన్యంలో చలి విజృంభిస్తోంది. ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే బెంబేలెత్తున్నారు. లంబసింగిలో అయితే అత్యల్పంగా 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో అది 3 డిగ్రీలుగా ఉంది. మినుములూరులో 9, పాడేరులో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
16 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా...
ప్రస్తుత లంబసింగి, చింతపల్లిలో నమోదైన ఉష్ణోగ్రతే రికార్డు అని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ విభాగం ఆర్‌ఏ డాక్టర్ సౌజన్య తెలిపారు. సాధారణంగా డిసెంబరు నుంచి జనవరి రెండో వారం వరకు మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదు అవుతుంటాయని, సంక్రాంతి తరువాత నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతుంటాయని ఆమె వెల్లడించారు. జనవరి చివరి వారంలో ఐదు డిగ్రీలకన్నా తక్కువ నమోదు కావడం చాలా అరుదని, 2006 జనవరి 28వ తేదీన మూడు డిగ్రీలు నమోదు కాగా, మళ్లీ 16 ఏళ్ల తరువాత 3 డిగ్రీలు నమోదైందని డాక్టర్ సౌజన్య పేర్కొన్నారు.
అంతకుముందు 2001 జనవరి 31న నాలుగు డిగ్రీలు, 1994 జనవరి 28న 3.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఆమె వెల్లడించారు. కాగా మన్యంలో రాత్రి తొమ్మిది గంటల నుంచే పొగమంచు కమ్ముకుంటున్నది. శివారు ప్రాంతాల్లో ఉదయం 10 గంటల వరకు మంచు దట్టంగా కురుస్తోంది. వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. మంచుతోపాటు శీతల గాలులు వీస్తుండడంతో చలి తీవ్రత అధికంగా వుంది. మిట్టమధ్యాహ్నం కూడా ఉన్ని దుస్తులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విజయవాడను కప్పేసిన మంచుదుప్పటి..
విజయవాడ నగర శివారు ప్రాంతంలో ముంచు దుప్పటి కప్పేసింది. పాయకాపురం, అజిత్ సింగ్ నగర్, నున్న ప్రాంతాల్లో భారీగా పొగమంచు కమ్మేసింది. పొగమంచు కమ్మేయటంతో కాసేపు వాహన రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పండిది. ఈ ఏడాదిలో ఇదే రికార్డు స్ధాయి పొగమంచు అని ఉదయపు నడకు వెళ్లేవారు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Green india challenge At GHMC park: ప్రకృతి 'బ్లెస్సీ'.. అభినందించిన కేటీఆర్, సంతోష్