లాక్‌డౌన్ సడలింపులలో ప్రభుత్వం కొన్నింటికి మినహాయింపులు ఇవ్వగా... మరికొన్నింటికి మాత్రం ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. వివాహాలకు హాజరయ్యేందుకు గరిష్టంగా 50 మందికి, అంత్యక్రియలు తదితర ఆచారాలలో పాల్గొనేందుకు 20 మందికి అనుమతిచ్చారు. ఆసుపత్రులు, ఫార్మసీలు మినహా మిగతా షాపులు, సంస్థలు రాత్రి ఎనిమిదిన్నర తర్వాత మూసివేయాలని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, రవాణా మార్గాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది. వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
వీటి అనుమతి లేదు..
పాఠశాలలు, కళాశాలలు, విద్యా, శిక్షణ, కోచింగ్ సంస్థలు మొదలైన వాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి కూడా సడలింపులు ఇవ్వలేదు. మెట్రో రైలుకు కూడా అనుమతి ఇవ్వలేదు. సినిమా హాళ్లు, వ్యాయామశాలలు, ఈత కొలనులు, వినోద కార్యక్రమాలు, ఉద్యానవనాలు, క్రీడా సముదాయాలు, బార్‌లు, ఆడిటోరియాలు, అసెంబ్లీ హాళ్లు వంటి ప్రదేశాలు, సామాజిక, రాజకీయ కార్యక్రమాలు, మతపరమైన, ఇతర పెద్ద సమ్మేళనాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు.
సడలింపులతో అనుమతి..
కంటైన్మెంట్ జోన్‌ల వెలుపల ఉన్న ప్రాంతాల్లో, లాక్‌డౌన్ ప్రారంభానికి ముందు అనుమతించబడిన అన్ని కార్యకలాపాలు అనుమతించినట్లు ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఏదేమైనా, ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచించిన విధంగా ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) నిబంధనలతో కొన్ని కార్యకలాపాలను జూన్ 8 నుంచి అనుమతించారు. మతపరమైన, ప్రజలు ఆరాధించే ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలు, షాపింగ్ మాల్స్ (గేమింగ్ సెంటర్లు, సినిమా హాళ్ళు కాకుండా) వంటి వాటికి అనుమతిచ్చారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు (అత్యవసర వైద్య సంరక్షణను పొందడం మినహా) పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించారు.
వీరు మాత్రం జాగ్రత్త..
వ్యక్తులు, వస్తువుల యొక్క అంతరాష్ట్ర, రాష్ట్రం లోపల ప్రయాణానికి ఎటువంటి ప్రత్యేక అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. బహిరంగ సమావేశాలు, సమ్మేళనాలు పూర్తిగా నిషేధించారు. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, గర్భిణీలు, 10 సంవత్సరాల లోపు పిల్లలు... ఆరోగ్య సమస్యలకు మినహా బయటకు రావొద్దని సూచించారు. కంటైన్మెంట్ జోన్‌లకు సంబంధించి జూన్ 30 వరకు కఠినమైన లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. అవసరమైన కార్యకలాపాలు మాత్రమే అనుమతించబడతాయి. వైద్య అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వస్తువులు, సేవల సరఫరాకు అనుమతించారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు