రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటన వెలువడిన అనంతరం మద్యం దుకాణాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది. వందలాది మంది దుకాణాల వద్దకు చేరుకుని అవసరానికి మించి మద్యాన్ని కొనుగోలు చేశారు. పది రోజులకు సరిపడా మద్యాన్ని తీసుకువెళ్లినట్లు దుకాణదారులు తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల వరకే రూ56 కోట్లు విలువైన మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా అయ్యింది. ఆ తరువాత పెద్ద మొత్తంలో విక్రయాలు జరగ్గా.... సుమారు రూ125 కోట్ల మద్యం అమ్ముడైంది.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో
మే నెలలో 11వ తేదీ వరకు రూ.676 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రోజుకు సుమారు రూ.61 కోట్ల సరుకు విక్రయించారు. అయితే మంగళవారం ఒక్కరోజే రెట్టింపు అమ్మకాలు జరిగాయని దుకాణదారులు వెల్లడించారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.24 కోట్లకు పైగా అమ్ముడవ్వగా.. నల్గొండలో రూ.15. 24 కోట్లు, ఖమ్మంలో రూ.12.25 కోట్లు, హైదరాబాద్‌లో రూ.10.17 కోట్ల విక్రయాలు జరిగాయి. రద్దీని బట్టి అదనంగా సరుకు తెప్పించుకున్నామని దుకాణదారులు తెలిపారు. డిపోల్లోనూ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసిన అబ్కారీ శాఖ... ఇండెంటు పెట్టిన వెంటనే మద్యం చేరవేసేలా చర్యలు తీసుకున్నారు.
తెరుచుకునే వెసులుబాటు
లాక్‌డౌన్ ప్రకటించిన అనంతరం మద్యం దుకాణాల విషయంలో....మరింత చర్చించిన తర్వాత అన్నింటి మాదిరిగానే వీటిని కూడా తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్సైజ్ నిబంధనల మేరకు ఉదయం 10 గంటలలోపు మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు తెరవకూడదు. కానీ, ఆ నిబంధనలు సడలించి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరుచుకునే వెసులుబాటు కల్పించింది. తద్వారా మద్యం ద్వారా వచ్చే రాబడిపై లాక్‌డౌన్ ప్రభావం పడదని అబ్కారీ శాఖ అంచనా వేస్తోంది.
బారులు తీరిన ప్రజలు
లాక్‌డౌన్ ప్రకటన తర్వాత నగరంలోని దుకాణాల వద్ద భారీగా ప్రజలు బారులు తీరారు. వివిధ వస్తువులు కొనుగోలు చేసేందుకు క్యూ కట్టారు. హైదర్‌గూడలోని బహర్ కేఫ్ వద్ద హలీమ్, బిర్యానీ తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చారు.
ఇదీ చదవండి: సరిహద్దుల్లో అంబులెన్స్‌లను అడ్డుకోవద్దు: హైకోర్టు