భాజపా నేత, వీఎన్ఆర్ ఇన్ ఫ్రా ఎండీ వాకాటి నారాయణరెడ్డిపై నమోదైన కేసులో చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని.. హైకోర్టు స్పష్టం చేసింది. వాకాటికి వ్యతిరేకంగా తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని గతేడాది నవంబరు 25న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవరించింది. రుణాల ఎగవేతపై ఆర్‌బీఐ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. గతంలో వాకాటి నారాయణరెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
వన్ టైం సెటిల్మెంట్ ద్వారా..
ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా కు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా.. రుణాలు తిరిగి చెల్లించినట్లు వాకాటి నారాయణరెడ్డి కోర్టులో వివరించారు. అయినప్పటికీ బ్యాంకులను మోసం చేసినట్లు పేర్కొనడం సమంజసం కాదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సీబీఐ బెంగళూరులో కేసు నమోదు చేసిందని తెలిపారు. కాబట్టి సీబీఐ, ఈడీ చర్యలు చేపట్టకుండా ఆదేశించాలని కోరారు.
ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినందుకు.. చట్టప్రకారం వ్యవహరించవచ్చని సీబీఐకి హైకోర్టు తెలిపింది. ఇప్పటి వరకు తాము ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఈడీ వివరించింది. ప్రతివాదుల జాబితా నుంచి ఈడీని తొలగించాలని ఆదేశించింది. వాకాటి పిటిషన్పై కౌంటరు దాఖలు చేయాలని ఆర్బీఐని ఆదేశిస్తూ.. విచారణను జులై 16కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: కస్తూర్బా పాఠశాలలో కొవిడ్ కలకలం.. ఏడుగురికి పాజిటివ్