రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో మొదలైన భూవివాదాలు అక్కడితో ఆగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి భూవివాదాలు ప్రస్తుతం భగ్గుమంటున్నాయి. 2018లోనే అధికారిక లెక్కల ప్రకారం రూ.257 కోట్ల విలువైన భూమి వివాదాల్లో చిక్కుకుంది. మార్కెట్ ధర ఇంతకు పదిరెట్లయినా ఉంటుంది. నాలుగేళ్ళ కాలంలోనే ఇలా వివాదాలపాలయిన భూమి విలువ 12 రెట్లు పెరిగిందని అధికారిక లెక్కల్లో తేలింది. ముఖ్యంగా హైదరాబాద్ శివారుల్లో ఈ భూముల వ్యవహారాలలో చిక్కుకొని ఇప్పటివరకూ 30 మంది పోలీసు సిబ్బంది సస్పెండ్ అయ్యారు. మనుషుల మధ్య ఉన్న మానవ సంబంధాలు తెగిపోయి సొంత అన్నదమ్ముల్లు కూడా శత్రువులుగా మారుతున్నారు. కేసులు పెట్టుకుంటున్నారు. చివరికి కొట్టుకునే వరకూ వెళుతున్నారు. ఇప్పుడు అది కాస్తా శృతి మించి అధికారులపై దాడులకు తెగబడే వరకూ వెళ్లింది.
విజయారెడ్డి హత్యతో వెలుగులోకి...
తహసీల్దారు విజయారెడ్డి హత్యతో రాష్ట్రంలో భూవివాదాల కేసుల అంశం తెరపైకి వచ్చింది. భూమికి సంబంధించిన వివాదాలంటేనే రెవిన్యూ సిబ్బంది వణికిపోయే పరిస్థితి నెలకొంది. భూకబ్జాలపై, వివాదాలపై కేసులు నమోదు అవుతున్నా ఎవరికి వారు రాజకీయ నాయకుల అండదండలతో కేసుల ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. వందల కోట్ల రూపాయల్లో మాత్రం ఆ భూముల విలువ పెరుగుతోంది.
పోలీసుల ప్రయత్నం విఫలం...
కొంత మంది బాధితులు ప్రైవేటుగా ఈ వివాదాలను పరిష్కరించుకోవాలని దందారాయుళ్ళను ఆశ్రయిస్తున్నారు. కేసుల సంఖ్య పెరగకపోవడానికి ఇదే ప్రధాన కారణం. భూవివాదాలు పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ తిరగడం వల్ల ఓ పట్టాన తేలవనే అభిప్రాయంలో చాలా మంది ఇలా చేస్తున్నారు. కొద్ది మంది మాత్రమే న్యాయస్థానాల ద్వారా పోలీస్ కేసులు నమోదు చేయిస్తున్నారు. భూ కబ్జా ఫిర్యాదులపై కేసు నమోదు చేసేందుకు ఎలాంటి పద్ధతి అనుసరించాలన్న దానిపై సైబరాబాద్ పోలీసులు గతంలో కొంత కసరత్తు చేసి ఖరారు చేశారు. దీనివల్ల కూడా పెద్దగా ప్రయోజనం కలగడం లేదు.
వివాదాలు కొని తెచ్చుకుంటున్న ఉద్యోగులు...
ఒకప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైన ఈ ఆక్రమణలు ఇప్పుడు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకూ విస్తరించాయి. ఏళ్ళ క్రితమే ఆస్తులు పంచుకున్న అన్నదమ్ములూ భూముల విలువ పెరగడం వల్ల లేని వివాదాలు సృష్టించుకుంటున్నారు. భూ లావాదేవీలు లాభాలు కురిపిస్తుండటంతో సొమ్ము చేసుకోవాలని అధికారులు చూస్తుంటారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసుశాఖల సిబ్బంది పైనే ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి. సొమ్ము చేసుకోవాలని చుస్తున్న వారి ఆశే వారిని బలి చేస్తోంది. అవినీతి నిరోధకశాఖకు చిక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో రెవెన్యూ వారిదే అగ్రస్థానం. సస్పెన్షన్లకు గురవుతున్న వారిలో పోలీసులదే ప్రథమస్థానం. ఏదోవిధంగా భూవివాదాల్లో తలదూర్చి కానిస్టేబుల్ నుంచి అదనపు ఎస్పీ స్థాయి వారి వరకూ సస్పెండ్ అవుతూనే ఉన్నారు.
ఇవీ చూడండి: అబ్దుల్లాపూర్మెట్లో భూ మాఫియా... రెండు వర్గాలదే హవా