నోటాకే తమ ఓటని సికింద్రాబాద్ లాలాపేట్వాసులు ప్రకటించారు. భారీ వరదలతో తాము ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏ పార్టీ నాయకుడు రాలేదని... ఇప్పుడు కూడా ఓట్ల కోసం ఎవరూ రావొద్దని లాలాపేట వినోబానగర్ నాలా ప్రాంత వాసులు చెబుతున్నారు. బస్తీలోని మహిళలందరూ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. రాజకీయ పార్టీలకు ఓట్లు వేయబోమని... నోటాకే వేస్తామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం తమకు ఇప్పటి వరకు ఎవరికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ ప్రాంతం పూర్తిగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని రోడ్లు, కలుషిత నీటి సమస్య, డ్రైనేజీ తదితర సమస్యలతో నిత్యం సతమతమవుతున్నామన్నారు. సీసీ రోడ్డు నిర్మాణం కోసం ఇరవై రోజుల క్రితం ఉన్న రోడ్లను ఇష్టానుసారంగా తవ్వి వదిలేశారు. ఇప్పటివరకు నిర్మాణం చేపట్టలేదని... గుంతల మయంగా మారిన రోడ్లపై నడవడానికి వీలులేకుండా ఉందన్నారు. తమను పట్టించుకునే నాయకుడే లేడని స్థానికులు వాపోయారు.