TRS Plenary Session begins: తెరాసను జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన తెరాస సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై తెరాస ‘భారత్ రాష్ట్ర సమితి’ గా మారింది. రాష్ట్ర మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్‌పర్సన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. సభ్యులందరూ తీర్మానాలపై సంతకాలు చేశాక... మధ్యాహ్నం ఒంటి గంట 19 నిమిషాలకు కేసీఆర్ సంతకం చేశారు. ఈ భేటీకి తమిళనాడులోని వీసీకే పార్టీ నేతలు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరయ్యారు.
అంతకు ముందు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చే దారిలో పార్టీ కార్యకర్తలు కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ వరకు దారులన్నీ గులాబీమయం అయ్యాయి. అతిథులు, నేతలు, కార్యకర్తల నడుమ సీఎం కేసీఆర్ కలిసి భారీ కాన్వాయ్‌తో సమావేశానికి వచ్చారు. దాదాపు రెండు గంటలపాటు జరగనున్న ఈ భేటీ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ సహా సభ్యులందరూ ప్రగతిభవన్ వెళ్లి భోజనం చేస్తారు. అనంతరం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
అంతకుముందు దసరా సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సిఎం కెసిఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి వృక్షానికి వేద పండితుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. పవిత్ర జమ్మి ఆకును అక్కడ హాజరైన వారందరికీ పంచిన సిఎం పరస్పర శుభాకాంక్షలు అందించి, ఆశీర్వదించారు. అనంతరం ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు , ప్రజా ప్రతినిధులు, సిఎం వో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి..