Jagga Reddy Comments On Revanth: క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ... పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించకుండా.. పార్టీ కార్యక్రమాలపై ప్రకటనలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కూడా కమిటీ ముందుకు పిలవాలని... అప్పుడే తాను కమిటీ ముందు హాజరవుతానని స్పష్టం చేశారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశం... అనంతరం ఛైర్మన్ చిన్నారెడ్డి మీడియాకు పలు విషయాలు వెల్లడించడంపై జగ్గారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
సోనియాగాంధీకి తాను రాసిన లేఖ మీడియాకు ఎలా లీక్ అయ్యిందో తనకు తెలియదన్న విషయమై.. వివరణ కూడా ఇచ్చినట్లు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తన లేఖపై క్రమశిక్షణ కమిటీకి ఎవరైనా ఫిర్యాదు ఇచ్చారా..? లేదా మీడియాలో వచ్చిన వార్తలను కమిటీ సుమోటోగా తీసుకుందా..? అన్న విషయాన్ని చిన్నారెడ్డి ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. పార్టీ లైన్ దాటి జరుగుతున్న ఎన్నో అంశాలు క్రమశిక్షణ పరిధిలోకి రావా..? అని నిలదీశారు.
జగ్గారెడ్డి సూటి ప్రశ్నలు..
" వచ్చే ఎన్నికల కోసం పార్టీలో చర్చించకుండా పెద్దపల్లి అభ్యర్థిని ముందే ప్రకటించి పార్టీ లైన్ దాటిన పీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణ పరిధిలోకి రాడా...? తన సొంత ఉమ్మడి జిలాల్లో ఒక ఎమ్మెల్యేగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనకు చెప్పకుండా కార్యక్రమం ప్రకటన చేస్తే అది క్రమశిక్షణ కిందకు రాదా ..? వరంగల్ పార్లమెంట్ ఇంఛార్జిగా నేను భూపాలపల్లిలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తున్నట్లు పత్రికల్లోనే చూశాను. దాని గురించి నాకు కనీసం సమాచారం ఇవ్వకపోవవడం క్రమశిక్షణ కిందకు రాదా..?. క్రమశిక్షణ పాటించని పీసీసీపై చర్యలు తీసుకోవాలన్న విషయం చిన్నారెడ్డికి తెలీదా...? క్రమశిక్షణ కమిటీ ముందుకు రేవంత్‌రెడ్డిని పిలిచిన తరువాత నన్ను పిలిస్తే తప్పకుండా హాజరవుతా. చిన్నారెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు కాబట్టే.. నేను కూడా ఆయనకు మీడియా ద్వారానే జవాబిస్తున్నా." - జగ్గారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఇవీ చూడండి: