ఒక వ్యక్తికి ఒకటికి మించిన సార్లు వైరస్ రావటానికి కారణాలు ఎలా ఉండొచ్చు?
వైరస్ సోకిన వారిలో తయారయ్యే యాంటీబాడీస్ మానవ శరీరంలో ఆరు నుంచి ఎనిమిది వారాలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత అవి కనుమరుగవుతాయి. లేకపోతే వాటి శక్తి బలహీనమవుతుంది. సహజంగా వైరస్ సోకిన వారు 14 నుంచి 21 రోజులపాటు ఐసొలేషన్‌లో ఉంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సమయంలో శరీరం కొంత శక్తిని పుంజుకుంటుంది. వైరస్ దాడిని ఎదుర్కొంటుంది. అయితే ఆ తర్వాత మునుపటి మాదిరిగా అన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుంది. ఆ జిత్తులమారి వైరస్ దాన్ని అవకాశంగా మలచుకుంటుంది. చాలామంది వైరస్ ఒకసారి వచ్చింది కదా మళ్లీ రాదు అనే భావనలో ఉంటున్నారు. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే.
వైరస్ సోకకుండా మీరు సూచించే ప్రత్యేక జాగ్రత్తలేమన్నా ఉన్నాయా?
రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. బలమైన ఆహారం తీసుకోవటం, తప్పని సరిగా వ్యాయామం చేయటం, మంచి నిద్ర, ఒత్తిడికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. సాధ్యమైనంత వరకు రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవటం మంచిది. గాలి, వెలుతురూ పరిమితంగా ఉండే ప్రాంతంలో నిరంతరాయంగా మూడు, నాలుగు గంటలపాటు ఉండకపోవటం మంచిది. వ్యాక్సిన్ వచ్చేంత వరకు మాస్కు, ఫేస్‌షీల్డు వాడాలి. మాస్కును నాలుగైదు గంటలకు ఒకటి తప్పనిసరిగా మార్చుకోవాలి. ఎన్-95, ఎన్-99 మాస్కులు సాధారణ ప్రజలకు అవసరం లేదు. ఏదైనా వస్త్రంతో చేసిన మాస్కులు నాలుగైదు ఉంచుకుని వాటిని మార్చి మార్చి వాడుకోవాలి. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.
గర్భిణులు, పిల్లలకు వైరస్ సోకే ప్రమాదం ఉందా?
గర్భిణులలో లక్షణాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి. అవి తల్లికి, బిడ్డకు ఎలాంటి ప్రమాదాన్ని తెచ్చిన దాఖలాలు లేవు. ఇతరుల నుంచి.. వారికి సోకే అవకాశాలు నామమాత్రమే. భారతదేశంలో చిన్న పిల్లల్లో వైరస్ సోకిన సందర్భాలు చాలా తక్కువ. కారణాలను పూర్తి స్థాయిలో విశ్లేషించలేను కానీ, పుట్టిన కొద్ది నెలల నుంచి వివిధ రకాల వ్యాక్సిన్లు మనం ఇప్పిస్తుండటం ఒక కారణం కావచ్చు.
కరోనా వచ్చి తగ్గాక మళ్లీ వచ్చేందుకు ఉన్న అవకాశాలపై మీ విశ్లేషణ ఏమిటి?
అవును, వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే విస్తృత స్థాయిలో అధ్యయనం చేయాలి. ఆ వైరస్ పోకడలు భిన్నంగా ఉంటున్నాయి. దాని రూపం ఎప్పుడూ ఒకే తరహాలో ఉండట్లేదు. అధికారికంగా ప్రస్తుతానికి గుర్తించింది హాంకాంగ్‌లో ఒకటి, అమెరికాలో మరొకటి మాత్రమే. మన దేశంలో రెండు మూడు రాష్ట్రాల్లో కొన్ని కేసులు వచ్చినట్లు వింటున్నాం కానీ ఇంకా వాటిపై పరిశోధనలు జరగలేదు. అధికారికంగా ప్రకటించలేదు.
నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా శరీరంలో వైరస్ ఉంటుందా?
అలాంటి అవకాశాలు లేవు. కొంతమంది ఆరోగ్యపరంగా చాలా సున్నితంగా ఉంటారు. అలాంటి వారు నెగెటివ్ వచ్చాక అప్రమత్తంగా వ్యవహరించకపోతే ఎక్కడి నుంచైనా.. ఎవరి నుంచైనా వైరస్ మళ్లీ వస్తుంది. ఐసొలేషన్ వ్యవధి ముగిసినా కనీసం మరో రెండు వారాలపాటు పూర్తి విశ్రాంతి, ఏకాంతంలో ఉంటే చాలా మంచిది.