ప్రాణవాయువు అందక తిరుపతి రుయా ఆసుపత్రిలో 11 మంది రోగులు చనిపోయిన ఘటనకు బాధ్యులెవరో ఇప్పట్లో తేలేలాలేదు. ఈనెల 10న ఆసుపత్రిలోని కొవిడ్ ఐసీయూ వార్డులో జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. మృతుల కుటుంబానికి రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ.. ఉన్నతస్థాయి కమిటీతో విచారణకు ఆదేశించారు. పక్షం రోజులు దాటినా ప్రభుత్వం నియమించిన ఈ కమిటీలో సభ్యులెవరు? ఇప్పటిదాకా జరిగిన విచారణ పురోగతి ఏంటి? అన్నది తెలియడం లేదు.
ఘటన జరిగిన మరునాడు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆసుపత్రిలో ప్రాథమిక విచారణ చేపట్టారు. వీరు విజిలెన్స్ ప్రధాన కార్యాలయానికి ఎలాంటి నివేదికా సమర్పించలేదని తెలిసింది. మరోపక్క, వైద్య ఆరోగ్య శాఖ డీఎంఈ అంతర్గత విచారణ (హౌస్ ఎంక్వైరీ) బృందాన్ని నియమించారు. ఎస్వీఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ జయభాస్కర్ నేతృత్వంలో ఇద్దరు రుయా వైద్య విభాగాధిపతులతో నియమించిన ఈ కమిటీ.. ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని మాత్రమే నివేదిక రూపంలో డీఎంఈకి సమర్పించింది. ఆ తర్వాత చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి విచారణ బాధ్యతలు అప్పగించారు. నాడు విధుల్లో ఉన్న నర్సుల నుంచి మాత్రమే వాంగ్మూలాలు సేకరించిన ఈ కమిటీ.. వైద్యులు, వైద్యాధికారులను ఇంకా విచారించలేదు. ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీతో పాటు స్థానికంగా మూడు కమిటీలు వేసినా.. ఈ ఘటనకు బాధ్యులెవరన్నది తేలలేదు. ఏ కమిటీ సమగ్ర నివేదిక అందించలేదు.
కంపెనీదే బాధ్యతనా?
రుయా ఆసుపత్రికి తమిళనాడు రాష్ట్రం శ్రీపెరంబూర్‌కు చెందిన లిండే కంపెనీ ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఆసుపత్రిలో 19 కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంకర్ సౌకర్యం ఉండగా.. ప్రస్తుతం రోజూ సగటున 14 కిలో లీటర్ల ఆక్సిజన్ అవసరమవుతుంది. ఒప్పందం ప్రకారం సకాలంలో ఆక్సిజన్ సరఫరా చేయడం, ట్యాంకర్ సమయానికి రాకపోతే బల్క్ సిలిండర్లతో అందించే బాధ్యత లిండే కంపెనీదే. ఆ రోజు రుయాకు ట్యాంకరు ఆలస్యంగా రాగా, వైద్యులు బల్క్ సిలిండర్లను అమర్చే ప్రయత్నం చేస్తుండగానే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోరంలో కంపెనీ నిర్లక్ష్యం ఉందా? ఆస్పత్రి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిందా? ఇంకా ఏమైనా కారణాలున్నాయా? అన్నది విచారణలో తేల్చాల్సి ఉంది.
మరోపక్క రుయా ఘటనలో నిజాలు నిగ్గుతేల్చాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌తో పాటు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లిబర్టీస్, సోషల్ జస్టిస్ సంస్థల ప్రతినిధులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్సీ.. నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ పంపింది. తిరుపతికి చెందిన భాజపా నాయకులు భానుప్రకాశ్‌రెడ్డి, తెదేపా నేత పీఆర్ మోహన్ సైతం హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీంతో ఎవరిని బాధ్యులను చేస్తారోనని నాడు విధుల్లో ఉన్న వైద్యాధికారులు, సిబ్బందిలో ఆందోళన నెలకొంది.