సమర్థ నీటి వినియోగం, యాజమాన్యం కోసం వినియోగించే సాంకేతిక పరిజ్ఞానంపై కింది స్థాయి అధికారుల వరకే కాకుండా రైతులు, ప్రజలకు పూర్తిగా అవగాహన పెరిగినపుడే మంచి ఫలితాలు వస్తాయని పలువురు సాగునీటి రంగ నిపుణులు, ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. నిర్ణయించిన మేరకు నీటిని సరఫరా చేయడం కాకుండా అవసరమైన మేరకు సరఫరా చేయాలని, తెలంగాణలో తాగునీటి అవసరాల కోసం విజయవంతంగా పూర్తిచేసిన వాటర్‌గ్రిడ్ లాగే అన్ని రకాల అవసరాలకు గ్రిడ్‌లు ఉండాలని సూచించారు. నీటివనరుల యాజమాన్యంపై జవహర్‌లాల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జె.ఎన్.టి.యు)లోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ డిజిటల్ ఎర్త్, ఆస్ట్రేలియా-ఇండియా వాటర్ సెంటర్ తదితర సంస్థలు కలిసి గురువారం అంతర్జాతీయ వెబినార్ నిర్వహించాయి.
ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటి పారుదల రంగ సలహాదారు ఎస్.కె.జోషి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మేరకు నీటి సరఫరా జరగాలని.. అయితే పెట్టుబడి, నిర్వహణ వ్యయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వాతావరణ మార్పులు నీటి లభ్యతపై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. నీటి లభ్యత ఉన్నచోట నిల్వ చేసుకొని తక్కువగా ఉన్న ప్రాంతానికి మళ్లించే వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని అభిప్రాయపడ్డారు. తాగునీటికి, పరిశ్రమలకు, సాగుకు అన్నింటికి ఒకేరకమైన నీటిని ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. సమర్థమైన నీటి యాజమాన్యం వల్లే వ్యవసాయంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రస్తుతం ఒక టీఎంసీ నీటిని ఇస్తే పొలాలకు చేరేటప్పటికి 30.3 శాతం మాత్రమే అందుతోందని వివరించారు.
ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన జె.ఎన్.టి.యు. ప్రొఫెసర్ తాటిపర్తి విజయలక్ష్మి మాట్లాడుతూ నీటి వినియోగం, యాజమాన్యంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం చాలా ముఖ్యమని, సదస్సులో వ్యక్తమైన అభిప్రాయాలను క్రోడీకరించి తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. సిరియాలో నీటి యాజమాన్యంపై మౌతాజ్ దలాటి, ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్శిటీ ప్రొఫెసర్ బసంత్ మహేశ్వరి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సీనియర్ శాస్త్రవేత్త మంజుశ్రీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ సీనియర్ అధికారి అర్చనా సర్కార్, సీఐఐ-త్రివేణి వాటర్ ఇన్‌స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కపిల్‌కుమార్, జి.బి.పంత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శివప్రసాద్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ డిజిటల్ ఎర్త్ వైస్ ప్రెసిడెంట్ సిద్దిఖీ మహమ్మద్ గౌస్ తదితరులు నీటి యాజమాన్యంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు, సాంకేతికత వినియోగం వల్ల వస్తున్న ఫలితాల గురించి వివరించారు. జె.ఎన్.టి.యు. రెక్టార్ గోవర్ధన్ మాట్లాడుతూ మిషన్ కాకతీయ వల్ల తెలంగాణలో భూగర్భ జలమట్టం పెరిగిందన్నారు.