Inter Exams Postponed in AP : ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు వాయిదా పడనున్నాయి. జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) మంగళవారం విడుదల చేసిన జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలు, ఇంటర్మీడియట్ పరీక్షలు ఒకే రోజు ఉండడంతో ఇంటర్ పరీక్షలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తవ్వాలి. కానీ జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి.
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష జరిగే 16న ఇంటర్ రెండో ఏడాది గణితం, వృక్ష, పౌరశాస్త్రం, 19న గణితం-2బీ, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్షలు ఉన్నాయి. ఒకేరోజు విద్యార్థులు జేఈఈ మెయిన్, ఇంటర్ పరీక్షలు రాయడం కుదరదు. జేఈఈ మెయిన్ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు 2 విడతల్లో నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను మొత్తం వాయిదా వేయాలా? లేదా.. ఒకే తేదీన ఉన్న పరీక్షలను వాయిదా వేస్తే సరిపోతుందా? అనే దానిపైనా అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలను యథావిధిగా కొనసాగించి, రెండో ఏడాది వాయిదా వేస్తే ఎలా అనే దానిపైనా సమాలోచనలు జరుపుతున్నారు. ఇంటర్‌పరీక్షలు వాయిదా పడితే ఆ ప్రభావం పదోతరగతి పరీక్షలపై పడుతుంది. ఈ నేపథ్యంలో ఎస్సెస్సీ బోర్డు, ఇంటర్ విద్యామండలి అధికారులు బుధవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
జూన్‌లో ఈఏపీసెట్? :
జేఈఈ మెయిన్, ఇంటర్మీడియట్ పరీక్షల వాయిదా కారణంగా ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌ను జూన్‌లో నిర్వహించే అవకాశముంది. జేఈఈ మెయిన్ మొదటి విడత 16 నుంచి 21 వరకు; రెండోవిడత మే 24 నుంచి 29 వరకు ఉంది.
జేఈఈ మెయిన్ ఇలా..
దరఖాస్తుల స్వీకరణ: ఆన్‌లైన్‌లో మార్చి 31 సాయంత్రం 5గంటల వరకు
మొదటి విడత: ఏప్రిల్ 16 నుంచి 21 వరకు
రెండో విడత: మే నెల 24 నుంచి 29 వరకు
- పేపర్-1 బీఈ, బీటెక్ 90మార్కులకు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష.
- పేపర్-2 బీఆర్క్ మొత్తం 82 మార్కులకు ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష.
- పేపర్-2బీ బీప్లానింగ్ 105 మార్కులకు ఉంటుంది. సాయంత్రం 3 నుంచి 6గంటల వరకు ఉంటుంది.
ఇదీ చదవండి :